చిత్తూరు నగరంలో అయిదేళ్ల కుమార్తెకు ఉరివేసి తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నగరానికి చెందిన కొరియర్ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్న గణేష్ ఓ ప్రైవేటు హోటల్లో గురువారం అర్థరాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తొలుత తన అయిదేళ్ల కుమార్తె కార్తీక మెడకు తాడు చుట్టి ఉరివేసి చంపాడు. అనంతరం గణేష్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
గణేష్ భార్య దివ్య వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించి... విసుగు చెంది కుమార్తెతో సహా ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. రెండో పట్టణ సీఐ యుగంధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గణేష్ ఆత్మ హత్యకు పాల్పడే ముందు తన ఫోన్లో రికార్డు చేసుకున్న సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతోంది. తమ ఇద్దరి ఆత్మహత్యకు తాను ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్య దివ్య కారణమని గణేష్ వీడియోలో కన్నీరు పెట్టుకున్నాడు. తన భార్య చెడు తిరుగుళ్లపై గతంలోనే గొడవలు జరిగాయని..పెద్దల పంచాయతీతో సద్దుమణిగినా తన భార్య వ్యవహారంలో మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు గణేష్.