Farmers not Received Compensation: చిత్తూరు జిల్లా రొంపిచర్ల - ఎర్రావారిపాలెం మండలాల సరిహద్దులో నిర్మించిన చల్లంపల్లె ప్రాజెక్ట్.. నీటితో కళకళలాడుతుంటే.. దీని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతుల కళ్లలో కన్నీరు సుడులు తిరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తై 14 ఏళ్లవుతున్నా నేటికీ భూములిచ్చిన రైతులకు పరిహారం అందలేదు.
2009 కంటే ముందే రూ.10 కోట్ల అంచనా వ్యయంతో.. చల్లంపల్లె ప్రాజెక్టు మంజూరైంది. దీని కోసం 60 మంది రైతుల నుంచి వందెకరాల భూమి సేకరించింది. ఈ విషయంలో ప్రస్తుత మంత్రి, అప్పటి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నీతానై వ్యవహరించారు. ఎందుకంటే పెద్దిరెడ్డి కుటుంబీకులకు చెందిన.. పీఎల్ఆర్ కన్‌స్ట్రక్షన్సే పనులు దక్కించుకుంది.
పరిహారం ఇవ్వకుండా పనులెలా మొదలుపెడతారని మొదట్లో రైతులుఅడ్డుకున్నారు. కానీ.. పనులు పూర్తికానివ్వండి.. పరిహారం ఇప్పించే బాధ్యత నాదని పెద్దిరెడ్డి అప్పట్లో.. వారికి నమ్మబలికారు. పీఎల్ఆర్ కన్‌స్ట్రక్షన్స్ ప్రాజెక్టు కట్టేసింది. వాటికి బిల్లులూ తీసేసుకుంది. ఇదంతా జరిగి పదమూడేళ్లవుతోంది. కానీ నేటికీ పైసా పరిహారం అందలేదని రైతులు వాపోతున్నారు.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 2009 నుంచి కొన్నాళ్లు వైఎస్ కేబినెట్‌లో.. ఆ తర్వాత రోశయ్య కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ఐనా చల్లంపల్లె నిర్వాసితులకు పరిహారం ఇప్పిస్తానన్న హామీని.. నెరవేర్చలేదు. సందర్భం వచ్చిన ప్రతీసారీ రైతులు అడుగుతూనే ఉన్నారు. 2014లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక.. ప్రభుత్వం మనది కాదంటూ మభ్యపెడుతూ వచ్చారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక కూడా.. వారికి న్యాయం జరగలేదు.