అధ్యాత్మికంగా... పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతూ... యాత్రికుల రద్దీ పెరుగుతున్నందు రేణిగుంట విమానాశ్రయ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయంగా తీర్చిదిద్దే లక్ష్యంతో 2009లో పరిసర ప్రాంతాల్లోని వ్యవసాయ భూములను సేకరించారు. రేణిగుంట, ఏర్పేడు మండలాల పరిధిలో దాదాపు 800 ఎకరాల భూమిని సేకరించారు.
సేకరించిన భూములకు పరిహారం చెల్లించలేదు. రైతులు విమానాశ్రయ విస్తరణను అడ్డుకున్నారు. ప్రభుత్వం స్పందించి ఎకరాకు 5 లక్షల 20 వేల చొప్పున... విడతల వారీగా 710 ఎకరాలకు పరిహారం చెల్లించి నిర్మాణాలు పూర్తిచేసింది. వికృతమాల గ్రామపంచాయతీతోపాటు సమీపంలోని మరో 3 గ్రామాల్లో 50 మంది రైతులకు పరిహారం చెల్లించలేదు. పదేళ్లుగా తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాల చుట్టు తిరిగినా పరిహారం చెల్లించలేదని వాపోతున్నారు.
గత ప్రభుత్వ హయాంలో... విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్ పరిశ్రమల ఏర్పాటుకు భారీగా భూములు సేకరించింది. ఆ భూమికి పరిహారం చెల్లించిన రెవెన్యూ అధికారులు... విమానాశ్రయానికి సేకరించిన భూములకు మాత్రం చెల్లించలేదు. ఒక సర్వేనెంబర్‌లోని సగం భూమికి పారిశ్రామిక అవసరాల సేకరణలో పరిహారం పొందిన రైతులు... అదే సర్వేనెంబర్‌లో విమానాశ్రయం కోసం సేకరించిన మిగిలిన భూమికి పరిహారం దక్కలేదని చెబుతున్నారు.