ఒకప్పుడు చిత్తూరు జిల్లా పడమటి ప్రాంతాల్లో కరవు కొట్టుమిట్టాడుతుండేంది. రైతాంగం వ్యవసాయాన్ని వదలి పట్టణప్రాంతాలకు వలస వెళ్లింది. కరోనా మహమ్మారి కారణంగా తిరిగి పల్లె బాట పట్టారు. ఎన్నో ఏళ్ల తర్వాత వ్యవసాయ రంగంలో అడుగులు పెట్టిన వారికి ఇటీవల కురిసిన వర్షాలు ఆశాజనకంగా మారగా.. సేద్యానికి కావల్సిన కాడెద్దులు, ఎడ్ల బండ్లు, వ్యవసాయ పనిముట్లు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు.
కాడెద్దుల జతల ధరలు ఆకాశాన్నంటాయి. లక్ష రూపాయలు పెడితే గాని వ్యవసాయానికి అనువైన కాడెద్దులు దొరికే పరిస్థితి లేదు. ఎడ్ల బండి కొనాలంటే తలకు మించిన భారంగా ఉంది. ఇక వ్యవసాయ పనిముట్లు కావాలంటే కనీసం 50 వేలు ఖర్చు చేయాలి. కూలీల రేట్లు భారీగానే ఉన్నాయి. రోజుకు 300 నుంచి 400 రూపాయలు ఇస్తేనే గాని కూలి పనులకు ఎవరూ రావడం లేదు. ఎరువుల ధరలు రైతులను భయపెడుతున్నాయి. వీటన్నిటినీ భరిస్తేనే గ్రామీణ రైతులు పూర్తిస్థాయిలో తమకు ఉన్న పొలంలో పంటలు వేసుకో గలరు.