చిత్తూరు జిల్లాలో రాయితీ వేరుసెనగ విత్తనం పంపిణీ సోమవారం ప్రారంభమైంది. గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు అందజేశారు. 19 మండలాల పరిధిలోని 185 ఆర్‌బీకేల ద్వారా పంపిణీని ప్రారంభించారు. జిల్లాలో తొలిరోజు 14,500 మంది రైతులకు 6,535 క్వింటాళ్ల విత్తనాన్ని పంపిణీ చేశారు. సాగు విస్తీర్ణంతో సంబంధం లేకుండా రైతుకు ఒక బస్తా మాత్రమే అందజేశారు. బస్తాతో ఎలా విత్తు వేసేదంటూ నిరాశకు గురవుతున్నారు. జిల్లాలో వర్షాధారంగా 1.13 లక్షల హెక్టార్లలో వేరుసెనగ సాగవుతోంది. ప్రధానంగా పశ్చిమ ప్రాంత రైతులు విస్తారంగా సాగుచేస్తారు. గతంలో ఒక్కో రైతుకు సాగు విస్తీర్ణం అనుగుణంగా బస్తా నుంచి 3-4 బస్తాల విత్తనం అందజేసేవారు. ప్రస్తుత ప్రభుత్వం గ్రామాల వారీగా నిర్ణీత సంఖ్యలోనే విత్తు అందజేయాలని నిర్ణయించి సరఫరా చేస్తోంది. ఒక బస్తాకే నమోదు చేసి.. నగదు చెల్లించుకున్నారు. బస్తా విత్తనాలతో ఎలా సాగుచేసేదని రైతులు అధికారులను ఆడిగినా..వారి నుంచి సరైన సమాధానం రాలేదు. సాగు భూమి విస్తీర్ణం అనుగుణంగా ప్రతి ఒక్కరికీ 2-3 బస్తాలు అందజేయాలని రైతులు డిమాండు చేస్తున్నారు.
వచ్చింది తక్కువ.. అవీ నాసిరకం
సోమవారం పలమనేరు మండలంలోని పెంగరగుంట, పిఒడ్డూరులో ఇచ్చిన కాయలు బూజు పట్టాయి. పెంగరగుంట గ్రామానికి చెందిన రైతులు ప్రభుత్వం ఇచ్చిన విత్తన కాయలను చూపించి ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుకు 30 కిలోలు
ప్రభుత్వం ఒకరికి 30 కిలోల విత్తనాలను సరఫరా చేస్తోంది. అవి ఎకరా పొలంలో సగానికి కూడా సరిపోవని రైతులు అంటున్నారు. మిగిలిన భూమిలో విత్తనాలు చల్లడానికి ప్రైవేటు వ్యాపారుల వద్ద కొనుగోలు చేయాల్సిందే. ప్రస్తుతం ప్రైవేటులో 30 కిలోల బస్తా రూ.2000 ధర పలుకుతోంది. ప్రభుత్వం రాయితీ పోను బస్తా రూ.1563 చొప్పున విక్రయిస్తోంది. కేవలం రూ.437 తేడా ఉండటంతో రైతులు ప్రభుత్వ విత్తనాల కోసం పోటీ పడటం లేదు.
కొన్ని బస్తాలలో వేరుసెనగ కాయలు చెడిపోయి ఉన్నమాట వాస్తవమేనని అందుకే అక్కడ సరఫరా ఆపేశామని పలమనేరు వ్యవసాయ అధికారి వేణుగోపాల్ తెలిపారు.