అప్పుల బాధ భరించలేక రైతు ఆత్మహత్య - farmer suicide news
చిత్తూరు జిల్లా పలమనేరు మండలం ఎగువకల్లాడులో అప్పుల బాధలు భరించలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీనివాసులు అనే వ్యక్తి... వ్యవసాయం, కుటుంబం కోసం చాలాచోట్ల అప్పులు చేశాడు. పంట దిగుబడి సరిగ్గా రాకపోవటంతో... అప్పులు తీరే మార్గం లేక పురుగులమందుతాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
అప్పుల బాధ భరించలేక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన చిత్తూరు జిల్లా పలమనేరు మండలం ఎగువకల్లాడులో జరిగింది. గ్రామానికి చెందిన శ్రీనివాసులు రెడ్డికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. శ్రీనివాసుల తండ్రికి ఇటీవల గుండె ఆపరేషన్ చేయించటంతో పాటు... తన పెద్ద కూతురికి వివాహం జరిపించాడు. కొంతకాలం క్రితం అతని భార్య అనారోగ్యం కారణంగా కర్ణాటకలోని బెంగళూరులో ఆపరేషన్ చేయించుకొని... ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ సమయంలో వ్యవసాయంలో వరుస నష్టాలు రావటంతో శ్రీనివాస్ అప్పులపాలయ్యాడు. ఏం చెయ్యాలో తెలియని స్థితిలో గత రాత్రి ఇంటి నుంచి వెళ్లిన శ్రీనివాసులు తిరిగి రాకపోవటంతో కుమారుడు... కుమార్తె చుట్టు పక్కల వెతికి చూశారు. ఉదయం పొలం వద్దకు వెళ్లగా అక్కడ పడి ఉన్న శ్రీనివాసులును గుర్తించి వెంటనే పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు ధృవీకరించారు. పంట దిగుబడి సరిగ్గా రాకపోవటంతో... అప్పులు తీరే మార్గం లేక పురుగులమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడని మృతుడి అన్న రామచంద్ర రెడ్డి తెలిపాడు.