చిత్తూరు జిల్లాలో శేషాచలం అడవులు విస్తారంగా విస్తరించి ఉన్నాయి. ఈ అటవీ సమీప గ్రామాల్లోని పంటలను అడవి జంతువులు నాశనం చేస్తుంటాయి. వాటిని కాపాడుకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతుంటారు. ఈ ప్రాంతంలో అత్యధికంగా వరి, చెరుకు పండిస్తారు. పంటలను కాపాడుకునేందుకు రాత్రిపూట కాపలా కాయడం, బైండింగ్ వైర్ చుట్టడం, టపాసులు పేల్చడం చేస్తుంటారు. వీటితో మనుషులకు ప్రమాదాలు జరిగిన ఘటనలు ఉన్నాయి. జంతువుల నుంచి పంటను కాపాడుకునేందుకు ఓ రైతు వినూత్నంగా ఆలోచించారు.
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని కాశిపెంట్ల పంచాయతీ ధనమూర్తిపల్లెకు చెందిన రైతు దామోదర్ నాయుడు ఆలోచన అందరి రైతులకు వరంగా మారింది. ఆరుగాలం కష్టించి పండించిన పంటను అడవి జంతువుల నుంచి కాపాడుకునేందుకు కేవలం మూడు వందల రూపాయల ఖర్చుతో పంటను రక్షించుకునేందుకు ఓ ఆలోచన చేశాడు. ఒక వెదురు బొంగు, పది అడుగుల దారం, టార్చ్ లైట్, థర్మకోల్ షీట్తో అడవి జంతువులకు దడ పుట్టిస్తున్నాడు.