FARMER DEATH AT MRO OFFICE : చిత్తూరు జిల్లా పెనుమూరు తహసీల్దార్ కార్యాలయంలో విషాదం చోటు చేసుకుంది. పెనుమూరు మండలం రామకృష్ణాపురం గ్రామానికి చెందిన రైతు రత్నం.. తన 2 ఎకరాల 50 సెంట్ల భూమి కోసం ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. తన భూమిని ఇప్పించాలంటూ ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఇలా 47 ఏళ్లుగా చేస్తున్న పోరాటానికి అధికారుల గుండె కరగకపోవడంతో.. తానే ప్రాణాలు వదిలారు.
ఈ ఘటనకు ముందు శుక్రవారం కలెక్టర్ సహా ఉన్నతాధికారులకు రైతు చేసిన ఫిర్యాదు వెలుగులోకి వచ్చింది. పెనుమూరు మండలం రామకృష్ణాపురం గ్రామం తన సొంత ఊరు అని ఫిర్యాదులో పేర్కొన్న రైతు..తనకు 2 ఎకరాల 50 సెంట్ల భూమి ఉందని తెలిపారు. 1974లో ఈ భూమికి ప్రభుత్వం పట్టా మంజూరు చేసిందని.. అప్పటినుంచి భూమి తమ ఆధీనంలోనే ఉందన్నారు. తిమ్మరాజు కండ్రిగ గ్రామస్థులు కొందరు తనను ఆ భూమిలోకి రాకుండా అడ్డుకుంటున్నారని.. దీనిపై చిత్తూరు కోర్టులో కేసు వేశానన్నారు.
1981లో కోర్టు తనకు అనుకూలంగా ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చిందని.. ఆ తర్వాత తనపై హత్యాయత్నం చేశారన్నారు. 2వేల సంవత్సరం నుంచి భూమిని తిరిగి సాగు చేసుకుంటున్నానన్న రైతు.. మళ్లీ ప్రత్యర్థులు కబ్జా చేసేందుకు యత్నించారన్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోకపోవడంతో.. మళ్లీ కోర్టును ఆశ్రయించి స్టేటస్‌కో ఉత్తర్వులు పొందానని తెలిపారు. అయినా తర్వాత నుంచి ఇప్పటి వరకూ ఇబ్బందికి గురి చేస్తూనే ఉన్నారని..2016లో కోర్టు తనకు పూర్తిస్థాయి అనుమతి ఇచ్చినా.. తహసీల్దార్ తప్పుడు సమాచారం పంపడంతో కలెక్టర్ దగ్గరా తనకు న్యాయం లభించలేదన్నారు.