చంద్రగిరి మండలంలోని ప్రభుత్వ మద్యం దుకాణాలపై పర్యవేక్షణ కరవైంది. పేరుకే ప్రభుత్వ మద్యం దుకాణాలు.. అక్కడ పనిచేసే సిబ్బంది మద్యాన్ని అధిక ధరలకు అమ్మడమేకాక.. కాలం చెల్లిన మద్యాన్ని అమ్ముతున్నప్పటికి పట్టించుకొనే నాథుడే కరవయ్యాడు. మండల పరిధిలో రంగంపేట, తొండవాడ, ఇందిరమ్మ కాలనీ, చంద్రగిరి, నరసింగాపురాల్లో ప్రభుత్వం మద్యం దుకాణాలను నిర్వహిస్తోంది. అయితే కొంతకాలంగా అధిక రేట్లకు అమ్మడమే కాకుండా ధర తక్కువ ఉన్న బాటిళ్లను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మంగళవారం నరసింగాపురంలోని షాపు నెంబర్ 298లో కొందరు బీరు బాటిళ్లు కొనుగోలు చేశారు. అనుమానంతో తేదీని చూసిన మందుబాబులు అవాక్కయ్యారు. ఈ నెల 2వ తేదీకే కాలం చెల్లినట్లు గుర్తించారు. షాపులో సూపర్ వైజర్ లేకపోవడంతో సేల్స్ మేన్ ను నిలదీశారు. పొంతన లేని సమాధానం చెప్పడంతో మందుబాబులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వైన్ షాపును సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.