చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా రాష్ట్రంలో హిందూ దేవాలయాలు, సంస్కృతి సాంప్రదాయాలపై దాడులు జరుగుతున్నాయని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి విమర్శించారు. దీని వెనుక ఓ రహస్య ఎజెండా దాగి ఉందని ఆరోపించారు. తిరుపతిలోని అలిపిరి పాదాల వద్ద హిందూ దేవాలయాలపై దాడులు, తితిదే అన్యమతస్థుల డిక్లరేషన్‌పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తెదేపా నిర్వహించిన ఆందోళనలో ఆయన పాల్గొన్నారు. పాదాల మండపం వద్ద ప్రత్యేక పూజలు చేసిన అమర్నాథ్ రెడ్డి...రాష్ట్రాన్ని కాపాడాలంటూ సాష్టాంగ నమస్కారం చేసి ప్రార్థనలు చేశారు.
అన్యమతస్థులు శ్రీవారి దర్శనం కోసం ఇవ్వాల్సిన డిక్లరేషన్ విషయంలో ఎంతటివారికైనా మినహాయింపులు ఇవ్వకూడదని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలు, ఆచార వ్యవహారాలపై జరుగుతున్న దాడుల వెనుకనున్న రహస్య ఎజెండాను త్వరలో ప్రజల ముందు పెడతామన్నారు. భక్తులు స్వామివారికి సమర్పించే కానుకలు, విరాళాలను బాండ్ల రూపంలో ప్రభుత్వానికి ఇచ్చే హక్కు ఎవరికీ లేదంటూ అమర్నాథ్ రెడ్డి మండిపడ్డారు.