ప్రశ్న: అమెరికావ్యాప్తంగా కరోనా ప్రభావం ఎలా ఉంది....ప్రత్యేకించి తెలుగువారిపై ఈ మహమ్మారి ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తోంది?
జవాబు:అమెరికాలో ఇప్పటికే 15 లక్షలకు పైబడి జనాభాకు కరోనా సోకింది. 92 వేల మందికిపైగా మరణాలు సంభవించాయి. కరోనా సోకిన వారిలో స్పానిష్ 27 శాతం, నల్లజాతీయులు 25శాతం, వైట్ అమెరికన్స్ 23శాతం మంది ఉన్నారు. కానీ ఆసియావాసుల్లో 4.7శాతం జనాభాకే కరోనా వైరస్ ప్రభావాన్ని చూపించింది. ప్రత్యేకించి భారతీయుల్లో ఎక్కువగా వైద్యులు, ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, దుకాణాల సముదాయాల్లో పనిచేసే వారికే ఎక్కువగా కరోనా సోకింది. అదృష్టవశాత్తు వీరిలో చాలామంది కోలుకున్నారు.
ప్రశ్న: అమెరికాలో ఏ రాష్ట్రంలో ఈ కరోనా ఎక్కువ ప్రభావాన్ని చూపించింది..?
జవాబు:న్యూయార్క్‌లో కరోనా తీవ్ర ప్రభావాన్ని చూపించింది. సుమారుగా మూడున్నర లక్షల మంది కరోనా బారిన పడ్డారు. డెట్రాయిట్, ఇల్లినాయిస్, లూసియానా, టెక్సాస్ రాష్ట్రాలపైనా దీని ప్రభావం ఉంది. కానీ న్యూయార్క్‌లో పరిస్థితే భయభ్రాంతులకు గురిచేస్తోంది.
ప్రశ్న: అనుకోకుండా ముంచుకువచ్చిన ఈ కరోనా ప్రభావంతో చాలామంది అమెరికాలో చిక్కుకుపోయారు. ప్రత్యేకించి విజిటింగ్ వీసాతో వచ్చి అమెరికాలో చిక్కుకుపోయిన వారి పరిస్థితి ఎలా ఉంది..?
జవాబు: అమెరికాలో తమ పిల్లల కోసం వచ్చినవారు, బీ1, బీ2 వీసాలతో వచ్చిన చాలామంది అమెరికాలో చిక్కుకుపోయారు. వాళ్లంతా కొంత ఇబ్బందులు పడిన మాట వాస్తవమే. వాళ్ల కోసం భారత ప్రభుత్వం అధికారికంగా ఒక వెబ్ లింక్‌ను విడుదల చేసింది. దాంట్లో రిజిస్టర్ చేసుకున్న వాళ్లు తిరిగి భారత్‌కు చేరుకునేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. విమానాల సంఖ్య పరిమితంగా ఉండటంతో అందరినీ ఒక్కసారే తరలించలేని పరిస్థితి నెలకొని ఉంది. ఫలితంగా వారి సహాయార్థం తానా ఒక పూర్తిస్థాయి స్వచ్చంద సంస్థలా కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఫోన్ కాల్స్ ద్వారా మమ్మల్ని సంప్రదించిన వారందరికి మార్గదర్శకం చేయగలుగుతున్నాం. కొంతమంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. వారిని దృష్టిలో పెట్టుుకుంటున్నాం. కొంతమంది వృద్ధులు మందులు లేక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారికి అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ ఫిజిషియన్స్(ఆపి) సహకారంతో వైద్యసహాయం అందేలా చూస్తున్నాం. వీసా గడువులు తీరిపోయిన వారికి 60 రోజులు గ్రేస్ పీరియడ్ దాటిపోయినా..ఇక్కడి ప్రభుత్వం మానవతా దృష్టితోనే ఆలోచిస్తోంది. హెచ్1 గడువు తీరిపోయిన వాళ్లను..ప్రస్తుతానికి బీ1, బీ2 కి దరఖాస్తు చేసుకునేలా వెసులుబాట్లు కల్పిస్తోంది.
ప్రశ్న: ఎక్కువ మంది తెలుగు వాళ్లు ఉన్నత ఉద్యోగాల కోసం అమెరికాలో ఉంటున్నారు. అకస్మాత్తుగా ఈ మహమ్మారి రావడంతో వారి ఉద్యోగాల పై దీని ప్రభావం ఎలా పడింది?
జవాబు: ఇప్పటి వరకూ అమెరికాలో 3కోట్ల మంది ప్రజలు నిరుద్యోగులుగా రిజిస్టర్ చేసుకున్నారు. కానీ వారిలో ఐటీ నిరుద్యోగులు కేవలం లక్ష మంది మాత్రమే. పర్యాటక రంగంపై కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. తెలుగువాళ్లంతా ఎక్కువ ఐటీ, హెల్త్ కేర్ రంగాల్లోనే ఉద్యోగాలను నిర్వహిస్తున్నారు. అమెరికాలో ఈ రెండు రంగాలపై కరోనా ప్రభావం తక్కువనే చెప్పుకోవాలి. వీటిల్లోనే ఎక్కువగా ఉద్యోగాలు చేస్తున్న మనవాళ్లంతా పూర్తి ఉద్యోగ భద్రతలోనే ఉన్నారు. కొంతమందికి ప్రాజెక్ట్‌లు అయిపోవటంతో....వీసా గడువులు ముగిసినా ప్రభుత్వం సైతం వారి పట్ల సానుకూలంగానే ఉంటూ....వీసా గడువుల పొడిగింపు కోసం ఇస్తున్న వెసులుబాట్లతో ఉద్యోగులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
ప్రశ్న: కరోనా వైరస్‌ను ఎదుర్కోవటంలో ఒక్కో దేశం ఒక్కో పద్ధతిలో పోరాడుతున్నాయి. అమెరికాలో వైరస్ నియంత్రణ కోసం ఎలాంటి చర్యలను చేపడుతున్నారు?
జవాబు: తొలుత కోవిడ్-19 ని అమెరికా నిర్లక్ష్యం చేసిందన్న మాట వాస్తవం. కానీ దీని వెనుక ఎన్నో సంక్లిష్టమైన అంశాలున్నాయి. ప్రపంచ వాణిజ్య రాజధాని న్యూయార్క్ లాంటి చోట్ల, పర్యాటక ప్రాంతాలకు పేరొందిన ఎన్నో నగరాల్లో ఒక్కసారిగా జాగ్రత్త చర్యలు చేపట్టడం అసాధ్యం. ప్రపంచ దేశాలన్నీ జాగ్రత్తపడే లోపలే అమెరికాలో వైరస్ తీవ్రంగా ప్రబలింది. ప్రపంచంలో ఎక్కడా లేనట్లు ప్రభుత్వ రంగ రవాణా సదుపాయాలను వినియోగించుకుంటారు. ఇవన్నీ వైరస్ వ్యాప్తి కేంద్రాలుగా మారాయి. ఎప్పుడైతే దీని తీవ్రతను ప్రభుత్వం గుర్తించిందో అప్పుడు తప్పనిసరి ఆదేశాలను జారీ చేసింది. అవసరమైన చోట్ల లాక్డౌన్ పరిస్థితిని తీసుకురావాలని స్పష్టం చేసింది.
ప్రశ్న: ప్రపంచంలో ఏ దేశానికైనా సమస్య వస్తే అమెరికా వైపు చూస్తుంటారు. చాలా సమస్యలకు పరిష్కారాలను సైతం అగ్రరాజ్యమే సూచిస్తుంటుంది. అలాంటింది ప్రపంచంలో ఇప్పుడు కరోనాతో ఎక్కువ ప్రభావితమైన దేశంగా అమెరికా మారటాన్ని ఎలా విశ్లేషిస్తారు. అక్కడి ప్రజల మానసిక పరిస్థితి ఎలా ఉంది..?
జవాబు: ప్రపంచంలో అన్ని విషయాల్లో ముందున్నట్లే వైరస్ వ్యాప్తిలోనూ ముందు ఉండాల్సిన పరిస్థితి తప్పనిసరిగా నెలకొంది. ఆలస్యంగా పరిస్థితిని గ్రహించినా....వ్యాపార వాణిజ్యాలను తిరిగి నిలబెట్టగలిగేలా...వ్యవస్థను గాడిన పెట్టేలా 2.6 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. 500లోపు ఉద్యోగులున్న ప్రతి పరిశ్రమను.. చిన్న పరిశ్రమలుగా గుర్తించి, వారందరికీ రెండునెలలకు సరిపడా మూలధనాన్ని ప్రభుత్వమే అందించింది. వ్యవస్థ గాడి తప్పకుండా...జాగ్రత్తలు తీసుకోవటంలో సఫలీకృతమైందనే చెప్పాలి.
ప్రశ్న: ప్రవాసాంధ్రులకు సంబంధించి తానానే అతిపెద్ద వేదికగా ఉంటోంది. అలాంటిది ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కోవటంలో తానా ఎలా భాగస్వామైంది?
జవాబు: తానా అందించిన సేవలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి మేము అమెరికాలో చేస్తున్న సేవలు...రెండోది తానా తరపున భారత్‌లో అందుబాటులోకి తీసుకువచ్చిన కార్యక్రమాలు. కేవలం విరాళాలతోనే ఓ ప్రత్యేక కార్యచరణ ప్రణాళికలను రూపొందించుకున్నాం. ప్రత్యేకించి తీవ్రంగా ఇబ్బంది పడుతున్న విద్యార్థులను గుర్తించాం. ఇప్పటివరకూ 4500మంది మన విద్యార్థులను ఆదుకున్నాం. వైద్యుల కోసం చైనా నుంచి తెప్పించిన పీపీఈ కిట్లను అందించాం. 7లక్షల మాస్కులను పంచిపెట్టాం. ఆసుపత్రుల్లో ఆహారాన్ని అందుబాటులో తీసుకు వచ్చేలా మా 50మంది సభ్యుల తానా కార్యవర్గం అద్భుతంగా కృషి చేస్తోంది. కోవిడ్ నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పెద్ద సంఖ్యలో సెమినార్లు నిర్వహించాం. యువకుల కోసం వారి భవిష్యత్ పై బెంగ లేకుండా కేరీర్ గైడెన్స్ ఇప్పించాం. ప్రముఖ సంగీత నేపథ్య గాయకులు, సంగీత దర్శకులతో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహించాం. ఇంతేకాకుండా భారత్‌లో తానా ఫౌండేషన్ ద్వారా లక్ష కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందించాం. ఇస్కాన్ లాంటి వివిధ సంస్థలతో కలిసి ఇప్పటి వరకూ మూడు లక్షలమంది పేదలకు అన్నం పెట్టగలిగాం. తమ పిల్లలను చూసేందుకు అమెరికాకి వచ్చి చిక్కుకుపోయిన ఎంతో మందిని తిరిగి భారత్‌కు చేర్చగలిగేలా ప్రయత్నాలను చేస్తూనే ఉన్నాం. ఈ ఆపత్కాలంలో తానాకు మద్దతుగా నిలబడి విరాళాలు అందించిన అందరి కృషి ఫలితంగానే మేం చెప్పుకుంటాం.
ప్రశ్న: ఉన్నత విద్య, ఉత్తమ ఉద్యోగ ఉపాధి అవకాశాలకు అమెరికా ఓ అత్యుత్తమ వేదికగా ఇప్పటివరకూ ఉంది. భవిష్యత్‌లో అమెరికా రావాలనుకునే వారికి ఎలాంటి సవాళ్లు ఎదురుకావచ్చు?
జవాబు: ప్రపంచమంతా కరోనాకి ముందు, కరోనా తర్వాత అన్నట్లు మారిపోనుంది. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల సైతం ఇదే అంశాన్ని ప్రస్తావించారు. వారి కంపెనీలో జరిగిన క్లౌడ్ సంబంధిత కీలక నిర్ణయాలన్నీ ఈ రెండు నెలల్లోనే జరిగాయంట. ఈ కామర్స్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఈ రంగంలో ఎక్కువగా ఉపాధి అవకాశాలు ఉంటాయి. ఐటీ లాంటి ఉద్యోగాలకు ప్రథమ ప్రాధాన్యంగా ఇక్కడి స్థానికులే ఉండొచ్చు. అమెరికా నుంచి భారత్‌కు తిరిగి వెళ్లేలా మనదేశంలో ఉద్యోగాలు పెరగొచ్చు. ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లుగా మనల్ని మనం మలుచుకోగలిగితే.....ఏ దేశంలోనైనా ఉపాధికి ఢోకా ఉండదు.
ప్రశ్న: ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి....అమెరికాలో సాధారణ పరిస్థితులు నెలకొనటానికి ఇంకెంత కాలం పట్టొచ్చు?
జవాబు: వాక్సినేషన్ వచ్చేంత వరకూ చెప్పటం కష్టం. జార్జియా, టెక్సస్ లాంటి రాష్ట్రాల్లో కఠిన ఆంక్షల తర్వాత తిరిగి కార్యకలాపాలు ప్రారంభిస్తే....తిరిగి కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ పరిస్థితి ఎక్కడి వరకూ దారి తీస్తుందో తెలియదు. ప్రజలంతా తమ జీవన శైలిలో వచ్చిన విభిన్నమైన మార్పులను ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్నారు. నా అంచనా ప్రకారం మరో సంవత్సరం వరకూ ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద మార్పులు ఉండకపోవచ్చు.
ప్రశ్న: అమెరికాలో తెలుగు వారు ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే...వారు తానాను ఎలా సంప్రదించాలి?
జవాబు: తెలుగు వారి గుండె చప్పుడు తానా. నేనీ మాట ప్రెసిడెంట్‌గా మాత్రమే చెప్పటం లేదు. అవసరం ఉన్న ప్రతి చోటా మేముంటాం. తెలుగువాళ్లు ఎక్కడ అత్యవసర పరిస్థితుల్లో ఉన్నా 1855ourtana నెంబర్లో అందుబాటులో ఉంటాం. ఎవరికి ఏం ఇబ్బంది ఎదురైనా మద్దతుగా నిలిచేలా....మా వంతు సాయం అందజేస్తాం.