చిత్తూరు జిల్లాకు పొరుగునే ఉన్న శ్రీ పెరంబదూరు, చెన్నై, బెంగళూరు, దాదాపు 800 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న విశాఖ నుంచి ఆక్సిజన్ సరఫరా అవుతోంది. తరచూ ప్రాణవాయువు ట్యాంకర్లు తిరుపతి, చిత్తూరులోని ఆక్సిజన్ ప్లాంట్లను నింపుతుండటంతో ఇప్పటివరకూ పెద్దగా సమస్యలు ఎదురు కాలేదు. ఈ నేపథ్యంలో గాలిలో సేకరించిన ఆక్సిజన్‌ను ద్రవరూపంలోకి మార్చి బాధితులకు అందించే వ్యవస్థ (పీఎస్‌ఏ)ను ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేశారు.
ఇప్పటికే తిరుపతి రుయాలో ప్రెజర్‌స్వింగ్ అడాప్షన్ (పీఎస్‌ఏ) కేంద్రం ఏర్పాటుకు గతంలోనే అనుమతి ఇచ్చారు. తాజాగా మరో అయిదు కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఫలితంగా ఆక్సిజన్ ట్యాంకర్లపై ఆధారపడటం కొంతమేర తగ్గే అవకాశం ఉంది. వీటన్నింటినీ మూడు నెలల్లో పూర్తి చేయాలని అధికార యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది.
తిరుపతిలోనే రెండు పీఎస్‌ఏలు
ఇప్పటికే తిరుపతి రుయాలో ఓ ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు అనుమతి ఇవ్వగా.. తాజాగా మరో రెండింటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తిరుపతిలోని బర్డ్, ఈఎస్‌ఐ ఆసుపత్రితోపాటు మదనపల్లె జిల్లా ఆసుపత్రి, పలమనేరు, నగరి ప్రాంతీయ వైద్యశాలల్లో కూడా వీటిని ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో కొవిడ్ బాధితులకు ఆక్సిజన్ సిలిండర్ల ద్వారా ప్రాణవాయువు అందిస్తున్నారు.
గతేడాదే ఇక్కడ ఆక్సిజన్ ట్యాంకరు ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పటికీ.. పురోగతి లేదు. ప్రస్తుతం 3 కేఎల్ ట్యాంకరుకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. దీని నిర్మాణంతోపాటు కొత్తగా పీఎస్‌ఏ ఏర్పాటు చేస్తే పడమటి మండలాల ప్రజలకు మరింత ప్రయోజనం ఉంటుంది. ఇందుకు అవసరమైన స్థలాన్ని చూపాలని ఉన్నతాధికారులు ఇప్పటికే జిల్లా ఆసుపత్రి వర్గాలను కోరారు.
ప్రతిపాదిత పీఎస్‌ఏ సామర్థ్యం 500 ఎల్‌పీఎమ్ (నిమిషానికి 500 లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి)గా ఉండనుంది. తద్వారా ఒకేసారి సుమారు 90 మంది కరోనా బాధితులకు ప్రాణవాయువు అందించవచ్చని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు. మిగతా నాలుగు ఆసుపత్రుల్లో ప్రతిపాదిత ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాల సామర్థ్యం 200 ఎల్‌పీఎమ్ నుంచి 1,000 ఎల్‌పీఎమ్ వరకు ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.