ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చెల్లి చచ్చిపోతానంటే అక్క సరే అంది.. ఆ తర్వాత తల్లిదండ్రులు కూడా! - మదనపల్లెలో కుమార్తెలను చంపిన తల్లిదండ్రులు న్యూస్

చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామీణ మండలంలో ఈనెల 24న కన్నబిడ్డలను హతమార్చిన ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. తనను తానూ కాళికగా భావించుకున్న పద్మజ.. కుమార్తె అలెఖ్యను చంపిన తర్వాత ఆమె నాలుకను కోసి తినేసినట్లు తెలిసింది.

enquiry on madanapalle superstion murders
enquiry on madanapalle superstion murders

By

Published : Jan 30, 2021, 6:49 AM IST

మదనపల్లె ఘటనలో రోజురోజుకు విస్తుపోయే విషయాలు తెలుస్తున్నాయి. 'తనను తాను కాళికగా భావించుకున్న నా భార్య పద్మజ.. పెద్ద కుమార్తె అలేఖ్య (27)ను చంపిన తర్వాత ఆమె నాలుకను కోసి తినేసింది.' అని పురుషోత్తంనాయుడు చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం. పోస్టుమార్టం నివేదిక వచ్చాక.. దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తాను పూర్వజన్మలో అర్జునుడినని అలేఖ్య చెప్పేదని పురుషోత్తం వైద్యులకు తెలిపారు. 'కళాశాలలో పాఠాలు చెప్పడం నీ వృత్తి కాదు.. పాండవుల తరఫున అర్జునుడు ముందుండి నడిపిన పోరాటస్ఫూర్తిని కొనసాగించాలి.' అని అలేఖ్య తనకు చెప్పినట్టు ఆయన తెలిపారు. ‘కలియుగం అంతమై.. సత్యయుగం వస్తుందని అలేఖ్య అనేది. కరోనా కూడా ఇందుకు ఒక సూచిక అని చెప్పేది. ఈ మాటలన్నీ నిజమే. నేను చదివిన ఆధ్యాత్మిక పుస్తకాల్లోనూ ఈ విషయాలే ఉన్నాయి’ అని వైద్యులకు చెప్పారు.

ఇద్దరికీ మానసిక వ్యాధి లక్షణాలు

‘పురుషోత్తం, పద్మజ ఇద్దరికీ మానసిక వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో జైలు లాంటి వాతావరణంలో చికిత్స అందించాలి. అందుకే విశాఖలోని ప్రభుత్వ మానసిక చికిత్స కేంద్రానికి సిఫార్సు చేశాం’ అని తిరుపతిలోని రుయా మానసిక వైద్యనిపుణులు పేర్కొన్నారు. ఇద్దరినీ మదనపల్లె సబ్‌జైలు నుంచి శుక్రవారం ఉదయం తిరుపతి రుయా ఆస్పత్రిలోని మానసిక చికిత్స విభాగానికి తరలించారు. పద్మజ మంత్రాలు పఠిస్తూ.. ‘నా బిడ్డలు తిరిగి వస్తున్నారు. ఇంటికి వెళ్లాలి. జైలులో తోడుగా ఉన్న శివుడు, కృష్ణయ్య ఇక్కడ కనిపించడం లేదు’.. అంటూనే వైద్యుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. పక్కగదిలో ఉన్న పురుషోత్తంనాయుడు ఏడుస్తూ వైద్యులతో మాట్లాడారు.

రక్తసంబంధీకుల్లోనూ మానసిక రుగ్మతలు

పద్మజ సన్నిహితులను మానసిక వైద్యులు విచారించగా ఆమె తండ్రి కూడా 20 ఏళ్లుగా మానసిక సమస్యలు ఎదుర్కొన్నారని తెలిసింది. పద్మజ మేనమామ కూడా ఇలాంటి ఇబ్బందులే పడ్డారని, వంశపారంపర్యంగా పద్మజకు.. ఆమె కూతురు అలేఖ్యకు ఇది సంక్రమించి ఉండొచ్చని మానసిక వైద్యులు భావిస్తున్నారు. ఆలేఖ్య ఫేస్‌బుక్‌ ఖాతా శుక్రవారం బ్లాక్‌ అయింది. ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా మాత్రం క్రియాశీలకంగానే ఉంది.

ప్రబోధకుల ప్రసంగాల వల్లేనా..?

చెల్లి చచ్చిపోతానంటే అక్క ఆమెను ప్రోత్సహించింది. అలాంటి ఆలోచన సరికాదని మొదట్లో వారికి సర్దిచెప్పిన తల్లిదండ్రులూ చివరికి అదే మూఢవిశ్వాస మైకంలోకి వెళ్లిపోయారు. చివరకు ఘోరమైన హత్యలకు పాల్పడ్డారు. అలేఖ్య భోపాల్‌లో చదువుతున్నప్పుడు అక్కడ పలువురు ప్రబోధకుల ప్రసంగాలు, రచనలకు ఆకర్షితురాలయ్యారు. నిరంతరం వాటి అధ్యయనంలోనే మునిగి తేలుతూ చివరికి భ్రమల్లోకి వెళ్లిపోయారు. తనలా అమ్మాయి రూపంలో శివుడు రావటం అరుదని భావించే అలేఖ్య.. అదే విశ్వాసాన్ని తల్లిదండ్రుల్లోనూ కలిగించేందుకు ప్రయత్నించారు. కళ్లను ఎర్రగా మార్చి.. వెంటనే మామూలుగా చేసేవారు. గతంలో తాను ఓ కుక్కను చంపి, పునర్జన్మ ప్రసాదించానని నమ్మబలికినట్లు తెలిసింది. ఏరోజు ఏ పూజ చేయాలో చెబుతూ ఇంట్లో చేయించేవారు. హత్యలకు కొన్నిరోజుల ముందునుంచి విచిత్రంగా ప్రవర్తిస్తూ, తాను చచ్చిపోతానంటూ సాయిదివ్య కేకలేస్తే, అలేఖ్య అందుకు మద్దతు పలికేది.

ఇదీ చదవండి:

నేనెప్పుడూ పరిధి దాటలేదు: ప్రవీణ్‌ ప్రకాశ్‌

ABOUT THE AUTHOR

...view details