చిత్తూరు జిల్లాలో 8వ రోజు లోకేశ్ పాదయాత్ర Nara Lokesh Yuvagalam Padayatra : నారా లోకేశ్ పాదయాత్రలో ఉద్రిక్తత తలెత్తింది. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండల కేంద్రానికి యాత్ర చేరుకున్నాక.. బహిరంగ సభ నిర్వహించేందుకు తెలుగుదేశం శ్రేణులు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ప్రచారరథం, మైకులు ఏర్పాటు చేశారు. ఐతే పోలీసులు మాత్రం బహిరంగ సభకు అనుమతి లేదని చెప్పారు. నడుచుకుంటూ ముందుకెళ్లాలని లోకేశ్‌కు సూచించారు. లోకేశ్ అందుకు ఒప్పుకోకపోవడంతో.. తెలుగుదేశం, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. తెలుగుదేశం కార్యకర్తలు, శ్రేణులను పక్కకు లాగేశారు.
పోలీసుల ఆంక్షలకు ఒప్పుకోని నారా లోకేశ్ పోలీసులు ఆపిన ప్రదేశంలో పక్కనే ఉన్న ఓ ఇంటిపైకి ఎక్కి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. పోలీసులతో పాటు సీఎం జగన్‌పైనా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
"ఖాకీలను పెట్టుకుని పోరాటం కాదు. ఆయన పాదయాత్ర చేస్తే జడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీ. రాజ్యాంగం ఈరోజు అమలులో లేదు.. రాజారెడ్డి రాజ్యాంగం మాత్రమే అమలులో ఉంది." -నారా లోకేశ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
అంతకుముందు చిత్తూరు జిల్లాలో 8వ రోజు లోకేశ్ యువగళం పాదయాత్రకు.. ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. పూతలపట్టు నియోజకవర్గం మొగిలి నుంచి యాత్ర సాగించిన లోకేశ్ మొగిలి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నడకను కొనసాగించారు. బంగారుపాళ్యం మండలం బలిజపల్లెకు పాదయాత్ర చేరుకున్నాక గ్రామస్థులతో లోకేశ్ సమావేశమయ్యారు. మహిళలు, వృద్ధులు తాము పడుతున్న ఇబ్బందులను యువనేతకు వివరించారు. ఏనుగు తొక్కి చంపినా పరిహారం ఇవ్వలేదని ఓ కుటుంబం లోకేశ్ దృష్టికి తీసుకొచ్చారు. అండగా ఉంటానని హామీ లోకేశ్ వారికి హామీ ఇచ్చారు. ఆ తర్వాత శేషాపురంలో మహిళలతో లోకేశ్ సమావేశం అయ్యారు. వారు చెప్పిన సమస్యలను విన్న లోకేశ్ అధికారంలోకి వస్తే ఏం చేయబోతామో వివరించారు.
ఇవీ చదవండి :