Eenadu-ETV Bharat Team Examined Sand Reaches in AP :రాష్ట్రంలో ఎక్కడా ఇసుక రీచ్‌లలో తవ్వకాలే జరగడం లేదట. NGTఆదేశాలకు కట్టుబడి 110 ఓపెన్ రీచ్‌లలో ఇసుక తవ్వకాలు పూర్తిగా ఆపేశారట. మళ్లీ పర్యావరణ అనుమతులు తీసుకున్నాకే తవ్వకాలు ప్రారంభిస్తారట. ప్రస్తుతం నదులు, జలాశయాల్లో పూడికతీత (డీసిల్టింగ్) మాత్రమే జరుగుతోందట. అది కూడా బోట్స్‌మెన్ సొసైటీల ద్వారా డ్రెడ్జింగ్ మాత్రమే చేస్తున్నారట. చిత్తూరు జిల్లాలోని అరణియార్ నదిలో అయితే ఎప్పుడో తవ్వకాలు ఆపేశారట. గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆశాఖ DMG చెప్పింది. ఇసుక అక్రమ తవ్వకాలపై ఎలాంటి జంకూ గొంకూ లేకుండా ఎలా పచ్చి అబద్ధాలు చెప్పేశారో. ఎక్కడా తవ్వకాలు జరగడం లేదని బుకాయిస్తూ ప్రజల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తున్నారు.
Sand Mining Carried Out in Defiance of NGT Orders :రాష్ట్రంలో చాలా జిల్లాల్లోని ఇసుక రీచ్‌ల్లో వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో భారీ యంత్రాలతో పగలూ రాత్రీ తేడా లేకుండా యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయన్నది యథార్థం. అయినా గనులశాఖ మంత్రి, డైరెక్టర్ అంత గట్టిగా తవ్వకాలు జరగట్లేదు అని చెబుతున్నారు కదా.. నిజంగానే NGT, సుప్రీంకోర్టు ఉత్తర్వులకు గౌరవం ఇచ్చి.. తవ్వకాలు ఆపేశారేమో చూద్దామని ఈటీవీ భారత్ - ఈనాడు- న్యూస్‌టుడే బృందాలు శుక్రవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇసుక రీచ్‌లను పరిశీలించాయి.
మంత్రి పెద్దిరెడ్డి సొంత జిల్లా చిత్తూరులోని అరణియార్ నదితో సహా రాష్ట్రంలో అనేకచోట్ల భారీ యంత్రాలతో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వేస్తున్నారు. రీచ్‌ల నుంచి వందల కొద్దీ లారీల్లో.. వేల టన్నుల ఇసుక తరలిస్తూనే ఉన్నారు. అక్రమ ఇసుక దందా ఎక్కడా ఆపలేదు. ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాల వల్ల పర్యావరణం దెబ్బతింటోందని, భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని స్థానికులు అడ్డుకుంటున్నా అధికార యంత్రాంగం అక్రమార్కులకు ఎలా సహకరిస్తోందో చెప్పడానికి శుక్రవారం సాయంత్రం ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం చతుకుపాడులో జరిగిన ఘటనే ప్రత్యక్ష నిదర్శనం.
అక్రమంగా ఇసుక తరలిస్తున్న 9 టిప్పర్లను, ఒక ఎక్స్‌కవేటర్‌ను సాయంత్రం 5 గంటలకు చతుకుపాడు గ్రామస్థులు అడ్డుకున్నారు. పాలేరు నది నుంచి వాహనాల్ని గ్రామంలోకి తీసుకెళ్లారు. వెంటనే సింగరాయకొండ ఎస్సై శ్రీరామ్ వచ్చి వాహనాలను ఎందుకు అడ్డుకున్నారని గ్రామస్థుల్నే బెదిరించారు. అక్రమ ఇసుక తవ్వకాల్ని అడ్డుకోవాల్సిన పోలీసులే, ఇసుక అక్రమార్కులకు అండగా నిలిచి, గ్రామస్థుల్ని బెదిరించడం ఇసుక అక్రమాలకు పరాకాష్ఠ కాదా?
Illegal Sand Mining at Will in YSRCP Government :ఈటీవీ భారత్- ఈనాడు- న్యూస్‌టుడే బృందాలు తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లోని 40 ఇసుక రీచ్‌లను శుక్రవారం పరిశీలించాయి. ఉదయం ఎనిమిదిన్నర నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య ఒక్కో రీచ్‌లో సగటున మూడు గంటలపాటు ఉండి, ఇసుక దందాను దగ్గరుండి గమనించాయి. వాటిలో 31 చోట్ల భారీ యంత్రాలతో తవ్వకాలు, లోడింగ్ జరుగుతున్నాయి. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పరిశీలించిన అన్ని ఇసుక రీచ్‌ల్లోనూ ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 10 రీచ్‌లు పరిశీలించగా ఏడు చోట్ల, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 9 రీచ్‌లు పరిశీలించగా నాలుగు చోట్ల, ఉమ్మడి కృష్ణా జిల్లాలో నాలుగు రీచ్‌లు పరిశీలించగా మూడు చోట్ల తవ్వకాలు జరుగుతున్నాయి.
రాష్ట్రంలోని ఇసుక రీచ్‌ల్లో సాగుతున్న అక్రమ ఇసుక దందా కళ్లున్న ఎవరికైనా కనిపిస్తుంది. ఆ రీచ్‌లకు శనివారం వెళ్లినా కచ్చితంగా అవే దృశ్యాలు కనిపిస్తాయి. ప్రతి రీచ్ ఒక చిన్న సైజు కేజీఎఫ్‌ను తలపిస్తోంది. చాలా చోట్ల అక్రమార్కులు ప్రైవేటు సైన్యాన్ని కాపలా పెట్టుకుని, బయటి వ్యక్తులు ఎవరూ రీచ్‌ల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. ఈటీవీ - ఈనాడు బృందాల్ని కూడా చాలా చోట్ల అడ్డుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం పొందూరులో నాగావళి నదిపై సింగూరు రేవు పరిశీలనకు వెళ్లిన 'న్యూస్‌టుడే' విలేకరిని రెండు కిలోమీటర్ల ముందే ఆపేశారు.