చిత్తూరు జిల్లా నారావారిపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రంలోని సిబ్బందిని కరోనా భయం వెంటాడుతోంది. మూడు రోజుల క్రితం ఆసుపత్రిలో ఇద్దరు ఏఎన్ఎంలు, ఓ స్వీపర్ కరోనా బారిన పడ్డారు. వారిని తిరుపతిలోని పద్మావతి క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. విధుల్లో ఉన్న ముగ్గురి వైద్యుల నుంచి అధికారులు నమూనాలు సేకరించారు. వాటి ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది.
అయితే ఇదంతా జరిగి మూడు రోజులు గడుస్తున్నా.. ఇప్పటికీ ఆసుపత్రిని ప్రోటోకాల్ ప్రకారం శానిటైజ్ చేయలేదు. దీనివల్ల చేసేది లేక నారావారిపల్లి ఆసుపత్రి వైద్యులు ఆరుబయటే వైద్యం అందిస్తున్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు గేట్ వద్దే చికిత్స అందించటం వైద్యుల్లో నెలకొన్న భయానికి అద్దం పడుతోంది. ఆసుపత్రిని ప్రోటోకాల్ ప్రకారం శానిటైజ్ చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది.