తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనం టోకెన్ల కోసం రాత్రి నుంచే భక్తులు తిరుపతిలో క్యూలైన్ల వద్ద పడిగాపులు కాశారు. ఉదయం 5 గంటల వరకూ టోకెన్ల క్యూలైన్లలోకి అనుమతించకపోవడంతో.. రోడ్లపైనే కూర్చుండిపోయారు. నగరపాలక సంస్థ కార్యాలయం, రామచంద్ర పుష్కరణి, మహతి ఆడిటోరియం, బైరాగిపట్టెడ రామానాయుడు పాఠశాల, వైకుంఠపురం నూతన కూరగాయాల మార్కెట్ టోకెన్ పంపిణీ కేంద్రాల వద్ద.. అర్ధరాత్రి నుంచి బారులు తీరారు. చలిలో చిన్నపిల్లలతో చాలా మంది తల్లితండ్రులు ఇబ్బందులు పడ్డారు.
నేటి నుంచి జనవరి 3 వరకూ పది రోజుల వైకుంఠదర్శనాలకు గానూ లక్ష సర్వదర్శనం టోకెన్లు పంపిణీ చేయాలని తితిదే భావించింది. ఇప్పటికే ఆన్ లైన్ లో రెండు లక్షల ప్రత్యేక ప్రవేశం దర్శనం టికెట్లు విక్రయించటంతో.. కొవిడ్ నిబంధనలకు భంగం కలగకుండా సర్వదర్శనం టోకెన్లను కేవలం తిరుపతి స్థానికులకే పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకుంది.