కరోనా ప్రభావం.. శ్రీవారి దర్శనాలపై భారీగా పడుతోంది. రాష్ట్రంలో పగటిపూట కర్య్ఫూ కారణంగా.. భక్తుల సంఖ్య భారీగా తగ్గింది. శ్రీవారిని మంగళవారం ఈ సంవత్సరంలోనే అత్యల్పంగా 2262 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయం వద్ద సాధారణంగా ఉండాల్సిన భక్తుల సందడి తగ్గి తిరుమల కళ తప్పింది. శ్రీవారికి 925 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం మరింత తగ్గి కేవలం రూ.11 లక్షలు మాత్రమే లభించింది. తిరుమలకు భక్తుల రాకపోకలు తగ్గడంతో పరోక్షంగా ఆ ప్రభావం శ్రీవారి హుండీ ఆదాయంపై పడింది.
కరోనా ప్రభావం రూ.300 శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లపైనా పడింది. గత నెల 20 తేదీన తితిదే ఆన్‌లైన్‌లో మే నెలకు సంబంధించిన ఎస్‌ఈడీ టికెట్లను విడుదల చేసింది. రోజుకు దాదాపు 15 వేల టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచినా కొవిడ్ ప్రభావంతో, రాష్ట్రంలో ప్రారంభమైన కర్ఫ్యూతో భక్తులు టికెట్ల కొనుగోలుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.