ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Tirupathi: సామాన్యులకు శ్రీవారి సర్వ దర్శనభాగ్యం ఎప్పుడు..?

శ్రీవారి దర్శనం కోసం సామాన్య భక్తులు నిరీక్షిస్తున్నారు. సర్వ దర్శనం ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 12 నుంచి ఇప్పటివరకు సర్వదర్శనం టికెట్లను జారీ చేయలేదు. దీంతో పేద, సామాన్య భక్తులు శ్రీవారి దర్శనానికి దూరమయ్యామని ఆవేదన చెందుతున్నారు.

ttd darshan
సామాన్య భక్తులు నిరీక్షణ

By

Published : Jul 1, 2021, 9:03 AM IST

Updated : Jul 1, 2021, 1:04 PM IST

తిరుమల శ్రీవారి సర్వదర్శనం కోసం సామాన్య భక్తులు ఆశగా నిరీక్షిస్తున్నారు. కరోనా మొదటి దశ సమయంలో గతేడాది మార్చి 20 నుంచి జూన్‌ 8వ తేదీ వరకు దాదాపు 80 రోజులపాటు భక్తులకు దర్శనాలను నిలిపివేసి శ్రీవారి కైంకర్యాలను తితిదే ఏకాంతంగా నిర్వహించింది. కరోనా రెండో దశ ప్రభావంతో ఈ ఏడాది ఏప్రిల్‌ 12 నుంచి ఇప్పటివరకు సర్వదర్శనం టికెట్లను జారీ చేయలేదు. దీంతో పేద, సామాన్య భక్తులు శ్రీవారి దర్శనానికి దూరమయ్యారు.

ఇదే సమయంలో ఆన్‌లైన్‌లోనూ రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శన టికెట్ల కోటాను తితిదే తగ్గించింది. మే నెలలో రోజుకు 15వేల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను జారీ చేసింది. వాటిని భక్తులు కొనుగోలు చేసినప్పటికీ కరోనా భయంతో దర్శనాలకు రాలేకపోయారు. దీంతో తితిదే జూన్‌లో ఈ టికెట్లను రోజుకు ఐదువేలకే పరిమితం చేసింది. జులైలోనూ అదే సంఖ్యలో దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో జారీ చేస్తోంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పడుతున్నట్లు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నందున.. అంతర్జాలంపై అవగాహన లేని భక్తులు, పేదలు నేరుగా వచ్చి తిరుపతిలో సర్వదర్శనం టైమ్‌స్లాట్‌ టోకెన్లను పొందేందుకు ఆశగా నిరీక్షిస్తున్నారు. శ్రీవారి దర్శనానికి ఆన్‌లైన్‌ టికెట్ల కోటాను పెంచాలని ఇప్పటికే భక్తుల విన్నపాలు పెరుగుతున్నాయి. మరోవైపు స్వామి దర్శనానికి మేలో రోజుకు అత్యల్పంగా 2 వేలలోపే భక్తులు వచ్చారు. జూన్‌లో ఇప్పటివరకు రోజుకు సరాసరి 18 వేలకుపైగా భక్తులు దర్శించుకుంటున్నారు. ఆన్‌లైన్‌ టికెట్ల పెంపుతోపాటు, సర్వదర్శనం టైమ్‌స్లాట్‌ టోకెన్ల జారీపై తితిదే ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Last Updated : Jul 1, 2021, 1:04 PM IST

ABOUT THE AUTHOR

...view details