పీలేరు నియోజకవర్గంలో నకిలీ వైద్యులు అరెస్ట్ చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో నకిలీ వైద్యులు అధికమయ్యారు. ఎటువంటి విద్యార్హతలు లేకపోయినా మొలలకు వైద్యం చేస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పీలేరు, కలికిరి, వాల్మీకిపురం, కలకడ మండల కేంద్రాల్లో ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా ఆస్పత్రులు నిర్వహిస్తున్నారు. వీరి దగ్గర చికిత్స చేయించుకున్న పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో నకిలీ వైద్యుల విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై స్పందించిన మదనపల్లి డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ లోకవర్ధన్ వైద్య సిబ్బందితో ఆసుపత్రులపై దాడులు నిర్వహించారు. ఎటువంటి విద్యార్హతలు లేని నకిలీ వైద్యులను పోలీసులకు అప్పగించారు. లైసెన్స్ లేకుండా అస్పత్రి బోర్డులు పెట్టరాదన్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.