విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై సీఎం నోరు మెదపడం లేదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టును సీఎం జగన్ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. విభజన చట్టంలో రాయలసీమకు నిధులు ఇవ్వాలని ఉంటే ఈ సీఎం అది కూడా అడగటం మార్చిపోయారని ఎద్దేవా చేశారు.
'బీసీలకు అన్యాయమే చేశారు'
సామాజిక న్యాయం అంటారు కానీ బీసీలకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. పెట్టుబడుల కోసం తాను ప్రపంచమంతా తిరిగానని పునరుద్ఘాటించారు. జగన్ అప్పుల కోసం తిరుగుతున్నాడని.. ఇప్పుడు అప్పులు ఇచ్చేవాడు కూడా లేడని పేర్కొన్నారు. ఈ నెల ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు లేవని.. రెండేళ్లు గడచినా పీఆర్సీ రాలేదన్నారు.
ఒక్క వారం రోజుల్లోనే సీపీఎస్ చేస్తానన్నాడు.. అలా ఇప్పటికీ ఎన్ని వారాలు గడిచాయి అని ప్రశ్నించారు.
'మోసం చేయడంలో దిట్ట'
ప్రజలను మోసం చేయటంలో సీఎం జగన్ దిట్ట అని.. అందుకే తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో బుద్ది చెప్పాలని ప్రజలను చంద్రబాబు కోరారు. అన్నింటిలో దోపిడీ చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. "రెండేళ్లు గడచింది.. మీ బాబాయిని హత్య చేసిందెవరో ప్రజలకు చెప్పరా" అంటూ నిలదీశారు. "మా నాన్నకు న్యాయం చేయాలని చెల్లెలు అడుగుతున్నారు.. అయినా ఈ ముఖ్యమంత్రి పట్టించుకోరు" అని ఎద్దేవా చేశారు.