వైద్యుడి నిర్లక్ష్యం కారణంగానే ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని ఆరోపిస్తూ.. చిత్తూరు జిల్లా కలికిరి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మృతుడి బంధువులు ఆందోళన నిర్వహించారు. స్థానికంగా భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న న్యామతుల్లా.. కళ్లు తిరిగి కిందపడిపోయాడు. కుటుంబీకులు అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న వైద్యుడు శంకరయ్య... న్యామతుల్లా మృతి చెందాడని చెప్పాడు. కానీ అతడి శరీరంలో ఉష్ణోగ్రత ఉండటం, నాడి కొట్టుకోవడంతో మరోసారి పరిశీలించాలని కోరినా వైద్యుడు అంగీకరించలేదని బంధువులు ఆరోపించారు.
తిరిగి న్యామతుల్లాను 18 కిలోమీటర్ల దూరంలోని పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లామని... అక్కడి వైద్యులు పరీక్షించి ఐదు నిమిషాల క్రితమే మరణించాడని.. కొంచెం ముందు తీసుకువచ్చి ఉంటే బతికించేవారమని చెప్పారన్నారు. ఈ ఘటనపై.. మృతుడి బంధువులు... కలికిరి ప్రభుత్వాసుపత్రికి చేరుకుని మృతదేహంతో ఆందోళనకు దిగారు. తాము చెబుతున్నా వినిపించుకోకుండా... న్యామతుల్లాకు వైద్యం చేయటానికి డాక్టర్ నిరాకరించాడని కన్నీటిపర్యంతమయ్యారు. తక్షణమే వైద్యున్ని అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బాధిత కుటుంబ సభ్యులను అదుపుచేసే ప్రయత్నం చేశారు.