చిత్తూరు జిల్లా వి. కోట మండలం తిమ్మరాజుపురం గ్రామంలో శ్మశానం లేక ఓ పెద్దావిడ మృతదేహం 2 రోజులనుంచి అంత్యక్రియలకు నోచుకోలేదు. ఎనభై ఏళ్ల వృద్ధురాలు వెంకటమ్మ మృతి చెంది రెండు రోజులవుతున్నా... ఆమెను పూడ్చేందుకు స్థలం లేని కారణంగా.. బంధువులు భూమి కోసం పోరాడుతున్నారు. వాగు పక్కనే ఉన్న స్థలాన్ని ఇటీవల శ్మశానానికి అధికారులు కేటాయించారు. అదే భూమిని సాగు చేసుకుంటున్న ఓ వర్గంవారు.. శ్మశానానికి ఇచ్చేది లేదంటూ భీష్మించి కూర్చున్నారు. ఈ కారణంగా.. సమస్య తీవ్రతరమైంది.
విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సర్వే చేశారు. ఆ భూమి శ్మశానానిదే అని తేల్చారు. అయినా... ఇవ్వబోమంటూ సాగు చేసుకుంటున్నవారు వాగ్వాదానికి దిగారు. చివరికి ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి. ఫలితంగా.. తిమ్మరాజపురం గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇన్నేళ్లనుంచి ఎవరైనా మృతి చెందితే వారి పొలాల్లోనే ఖననం చేసుకునేవారు. తాజాగా మృతి చెందిన వెంకటమ్మకు సొంత భూమి లేకపోవడమే సమస్యకు కారణమైంది. భూమిలేని పేదలు చనిపోతే.. వారికి అంత్యక్రియలు ఎక్కడ చేయాలో చెప్పాలంటూ గ్రామంలో ఓ వర్గం పట్టుబడిన పరిస్థితుల్లో శ్మశాన స్థలం కోసం ఆందోళనకు దిగారు. రెవెన్యూ అధికారులు, పోలీసులు గ్రామానికి చేరుకొని సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు.