జాగ్రత్తగా వెళ్లకుంటే.. అదే చివరి ప్రయాణం కావొచ్చు! చిత్తూరు జిల్లా చంద్రగిరిలోని జాతీయ రహదారులపై జరుగుతున్న వరుస ప్రమాదాలు.. అటు అధికారులను ఇటు ప్రజలను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. చంద్రగిరి మండలంలో పూతలపట్టు - నాయుడుపేట, తిరుపతి - అనంతపురం రెండు జాతీయ రహదారులు ఉన్నాయి. చంద్రగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు 60 కిలోమీటర్ల మేర ఇవి ఉన్నాయి. ఈ దారులలో నిత్యం జరుగుతున్న ప్రమాదాలు పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
ప్రమాదకర రోడ్లు
రాష్ట్రంలో అత్యంత ప్రమాదకరమైన రహదారుల్లో పూతలపట్టు - నాయుడుపేట ఒకటి. అందులో రేణిగుంట, శ్రీకాళహస్తి , చంద్రగిరి మార్గం మరింత ప్రమాదకరం. అలాగే తిరుపతి- మదనపల్లి జాతీయ రహదారి ప్రమాదకరమైనదే. ఇవి రక్తదారులుగా మారి ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. చంద్రగిరి నుంచి భాకరాపేట వరకు 33 కిలోమీటర్ల జాతీయ రహదారి విస్తరించి ఉంది. ఈ మార్గంలో గుట్టలు, కొండలు, మలుపులు అధికంగా ఉంటాయి. అందులోనూ ఆర్అండ్బీ అధికారులు ప్రమాద సూచికలు, ప్రమాదకర మలుపులు ఉన్న చోట ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టకపోవటంతో ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి.
ఎందరినో బలితీసుకున్న దారులు
భాకరాపేట కనుమదారిలో సెప్టెంబర్ 25న యాదమరి మండలం గొల్లపల్లికి చెందిన జమున ఇద్దరు పిల్లలతో స్కూటీపై వెళుతుండగా ట్రాక్టర్ ఢీకొని ముగ్గురు మృతి చెందారు. అక్టోబర్ 6న కారు, 3 లారీలు వెంటవెంటనే ఢీకొన్న ఘటనలో లారీలు బోల్తాపడ్డాయి. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం తప్పగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అక్టోబర్ 24వ తేదీన మదనపల్లి నుంచి చెన్నై కోయంబేడు మార్కెట్కు టమోటా లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తప్పించుకోగా క్లీనర్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. ఆగస్టు 7న పూతలపట్టు - నాయుడుపేట జాతీయ రహదారిపై పాతకాలువ వద్ద టిప్పర్ ఢీకొని బైకర్ చనిపోయాడు. అక్టోబర్ 25వ తేదీన సీ. మల్లవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్ణాటక ఆర్టీసీ బస్సు స్కూటర్ని ఢీకొనటంతో ఓ యువకుడు మృతి చెందాడు.
ఇలా ఎందరో వాహనదారులు, ప్రయాణికులు ప్రమాదాలకు గురై చనిపోగా.. మరెందరో వికలాంగులయ్యారు. రహదారులు ప్రజల ప్రాణాలు తీస్తున్నా వాహనదారుల్లో కానీ అధికారుల్లో కానీ మార్పు రావడంలేదు. దీంతో ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. చంద్రగిరి నియోజకవర్గంలో జరుగుతున్న ప్రమాదాల్లో అధికశాతం మానవ తప్పిదాల వల్లే జరుగుతున్నాయని ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి.
ఇవీ చదవండి:
'కరోనా ఉన్నా వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని పూర్తిచేస్తున్నాం'