ఆన్‌లైన్ లాటరీ పేరుతో చిత్తూరు జిల్లా నంబాకం గ్రామానికి చెందిన యువతిని (cheated a woman in the name lottery) మోసగించిన కేసులో ఉంగాండకు చెందిన నెల్సన్ హోగ్లర్ అలియాస్ జాన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని పోలీసులు దిల్లీలో అదుపులోకి తీసుకున్నారు.
లాటరీలో 2.5 కోట్లు వచ్చాయని..
ఆన్‌లైన్ లాటరీలో రూ.2.5 కోట్లు వచ్చాయని నంబాకం ప్రాంతానికి చెందిన యువతికి గత ఏడాది అక్టోబరులో నిందితుడు ఫోన్ చేశాడు. లాటరీ డబ్బు పొందాలంటే ముందుగా కొంత సొమ్మును చెల్లించాల్సి ఉంటుందని నమ్మబలికాడు. అతడి మాటలు నమ్మన యువతి ఇల్లు, పొలం కుదవపెట్టి దశల వారీగా రూ.13,78,890 నిందితుడి ఖాతాలో జమచేసింది. రోజులు గడుస్తున్నా లాటరీ సొమ్ము రాకపోగా..అటునుంచి స్పందన కురవైంది. మోసపోయానని గ్రహించిన యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
ప్రత్యేక బృందం ఏర్పాటు..
జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ పుత్తూరు డీఎస్పీ యశ్వంత్ నేతృత్వంలో ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. నగిరి ఇన్స్పెక్టర్ మద్దయ్యచారి ఆద్వర్యంలో దిల్లీ వెళ్లిన బృందం అక్కడి పోలీసుల సహకారంతో నిందితుడని అదుపులోకి తీసుకున్నారు.