వర్షాలు కురవాలి.. ఎగువ ప్రాంతాల్లో ఉన్న చెరువులు నిండి తమ పొలాలకు సాగునీరు అందాలని రైతులు, చెరువు సమీప ప్రాంత గ్రామాల ప్రజలు కోరుకోవడం సాధారణం. కానీ చిత్తూరు జిల్లాలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో కురిసిన భారీ వర్షాలతో చెరువుల కట్టలు బలహీనపడటం, కోతకు గురవడంతో వరదనీరు వస్తే తెగి తమ గ్రామాలు, పొలాలు ముంపునకు గురవతాయన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది.
ఎనిమిది నెలల క్రితం వచ్చిన నివర్ తుపాన్ చిత్తూరు జిల్లాను అతలాకుతలం చేసింది. భారీగా కురిసిన వర్షాలతో చెరువులు దెబ్బతినడంతో కింద ఉన్న పంటపొలాలు నీట మునిగాయి. పొలాల్లో ఇసుక మేటలు వేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పటికీ చెరువులు మరమ్మతులు చేయకపోవడంతో మరోసారి భారీ వర్షాలు వస్తే తీవ్ర నష్టం వాటిల్లుతుందన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది.
జిల్లా వ్యాప్తంగా ఉన్న 8,063 చెరువుల్లో 802 దెబ్బతిన్నాయి. 313 చెరువులకు కట్టలు తెగిపోగా 118 చోట్ల గండ్లుపడ్డాయి. నివర్ తుపానుకు 295 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. తాత్కాలిక పనులకు 55 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపారు. నెలలు గడుస్తున్నా ప్రతిపాదనల దశ దాటకపోవడంతో మళ్లీ వర్షాలు పడితే కట్టలు తెగి వరదనీరు గ్రామాలను ముంచెత్తుతుందన్న భయం దిగువ గ్రామాల ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.