డాక్టర్ అనితారాణిని వేధించిన వైకాపా నేతలపై.. కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ముఖ్యమంత్రికి జగన్‌కు లేఖ రాశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వైద్యులు ముందు వరుసలో ఉండి పోరాడుతున్నారని.. అలాంటి వారిని వేధింపులకు గురిచేయడం తగదనీ అన్నారు. ప్రపంచమంతా డాక్టర్లను కీర్తిస్తూ ఉంటే.. మన రాష్ట్రంలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోందని చెప్పారు.
మాస్కులు, సరైన రక్షణ పరికరాలు లేవన్నందుకు డాక్టర్ సుధాకర్‌ను సస్పెండ్ చేసి, నడిరోడ్డుపై అవమానపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు చిత్తూరు జిల్లా పెనమూరు వైద్యురాలిని వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. ఈ విషయంపై ఆ వైద్యురాలు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం విచారకరమన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలని రామకృష్ణ కోరారు.