తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన తమిళనాడులోని ఆస్తులను అమ్మాలనే తితిదే బోర్డు నిర్ణయం... దుర్మార్గమైన చర్య అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం లేకుండా బోర్డు ఎలా నిర్ణయం తీసుకుంటుందని ప్రశ్నించారు. వేలంలో విజయం సాధిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి విజయం.. ఓడిపోతే బోర్డు ఛైర్మన్ వై.వీ.సుబ్బారెడ్డే కారణమని నెట్టివేసే ప్రయత్నం జరుగుతుందన్నారు.
భూములు అన్యాక్రాంతం అవుతున్నాయంటే అది ప్రభుత్వ అసమర్థతే అని స్పష్టం చేశారు. సాంఘిక సేవా పరిధిలోనే ఆస్తులు ఉపయోగపడాలని అప్పుడే తితిదే ఔన్నత్యం పెరుగుతుందని నారాయణ అభిప్రాయపడ్డారు. తితిదే ఆస్తుల అమ్మకం నిర్ణయాన్ని సీపీఐ వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. ఆ నిర్ణయం నుంచి ప్రభుత్వం వెనక్కు తగ్గాలని కోరారు.