ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాల అనంతరం దేశ రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకోబోతున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ అన్నారు. మారుతున్న పరిణామాలను కమ్యూనిస్టు పార్టీ నిశితంగా పరిశీలిస్తోందని.. భాజపా వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో సైతం వేగంగా రాజకీయ పరిణామాలు మారుతున్నాయన్నారు. మేడే సందర్భంగా చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గ కేంద్రంలో ఏఐటీయూసీ జెండాను నారాయణ ఆవిష్కరించారు. కరోనా కట్టడిలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ గ్రాఫ్ పడిపోవడం ఖాయమని అన్నారు.
సరిపడా ఆసుపత్రులు లేక అవస్థలు..
దేశంలో కొవిడ్ పేషెంట్లకు సరిపడా ఆసుపత్రులు లేక ఒక్కో స్ట్రెచర్‌పై ఇద్దరు రోగులు పడుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. కేసులు పెరుగుతుంటే కుంభమేళా ఉత్సవాలు నిర్వహించిన ఘనత ఒక్క మోదీకే దక్కుతుందని విమర్శించారు.