ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లక్ష ద్వీప్​లో లౌకిక ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి: సీపీఐ జాతీయ కార్యదర్శి - chittoor district news

ముస్లిం, మైనారిటీలు అధికంగా ఉండే లక్ష ద్వీప్​లో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ చిత్తూరులో ఆరోపించారు. దీనికి అనుగుణంగా వ్యవహరిస్తున్న లెఫ్టినెంట్ గవర్నర్ పటేల్​ను తక్షణం రీకాల్ చేయాలని ఆయన డిమాండ్​ చేశారు. దీవులను కార్పొరేట్ల పరం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని అన్నారు.

cpi narayana on Lakshadweep
లక్ష ద్వీప్ లో లౌకిక ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి

By

Published : Jun 8, 2021, 8:47 PM IST

ప్రశాంత వాతావరణంలో సమైక్య జీవన విధానానికి చిహ్నంగా ఉంటున్న లక్ష ద్వీప్​ ప్రజల్లో చిచ్చు రేపుతున్న లెఫ్టినెంట్ గవర్నర్ పటేల్​ను తక్షణం రీకాల్ చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ డిమాండ్ చేశారు. లక్ష ద్వీప్ ప్రజలకు సంఘీభావంగా సీపీఐ జాతీయ సమితి ఇచ్చిన పిలుపు మేరకు.. చిత్తూరు జిల్లా నగరిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్రపాలిత ప్రాంతంగా ఉంటున్న లక్ష ద్వీప్​ ఐఏఎస్ అధికారి పరిపాలన సాగుతుండగా.. నేడు సంఘ్ పరివార్ ఏజెంట్​ను గవర్నర్​గా నియమించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అక్కడ 75 వేల జనాభాలో 98 శాతం మంది ముస్లిం, మైనారిటీ సోదరులే ఉన్నారని.. గవర్నర్​ వికృత చేష్టలతో వారికి ఉపాధి లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. పటేల్ నియంతృత్వ ధోరణితో అక్కడ ఉన్న పాడి పరిశ్రమలను మూసివేయడం, అక్కడి ప్రజలు గోవు మాంసం తింటారంటూ.. మాంసం విక్రయాలపై నిషేధం విధించడం, ఈ చర్యలను ప్రశ్నిస్తూ.. ఎదురు తిరిగే వారిపైన గూండా చట్టం కింద కేసులు పెట్టడం అమానుషమని అన్నారు. ఆహార, వ్యవహారాలపై ఆంక్షలు రాజ్యాంగ విరుద్ధమని సీపీఐ ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తోందన్నారు.

లక్షద్వీప్​ లోని పాల ఫ్యాక్టరీలను నిర్వీర్యం చేసి గుజరాత్​లోని అమూల్​ పాల పరిశ్రమతో ఒప్పందం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కార్పొరేట్ సంస్థలకు దీవిని అప్పగించడానికి అధికారంలో ఉన్న ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా లు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇటువంటి చర్యలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు.

అక్కడి ప్రజలు సమీపంలోని కేరళ రాష్ట్రం నుంచి ఆహారపదార్థాలను దిగుమతి చేసుకోవడం, మంచి సంబంధాలు కలిగి ఉన్నందుకే.. కేంద్రం ఆ దీవుల పై కక్ష గట్టిందని పేర్కొన్నారు. ప్రజలను అక్కడ నుండి ఖాళీ చేయించి టూరిజం దీవిగా మార్చి కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ విషయంలో అక్కడి ప్రజలకు యావత్​ భారతదేశం అండగా నిలుస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే భవిష్యత్తులో దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details