చిత్తూరు జిల్లాలో ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తుంటే... వందల సంఖ్యలో పాజిటివ్ వచ్చిన వ్యక్తుల ఆచూకీ దొరకకుండా పోతుండటం మరింత కలవరపెడుతోంది. నమూనాలు ఇచ్చే సమయంలో తప్పుడు ఫోన్ నెంబర్లు, చిరునామాలు ఇస్తూ కొందరు అధికారుల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. మరికొందరు ఫోన్‌లు స్విచ్ఛాప్ చేస్తుండగా... ఇంకొందరు ఫలితాలు రాకముందే ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నారు. దీని వల్ల పాజిటివ్ వచ్చినా వారిని గుర్తించడంలో అధికారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలా దొరకకుండా ప్రజల్లో తిరిగే పాజిటివ్ వ్యక్తుల వల్ల.. కొవిడ్ వ్యాప్తి మరింత ప్రమాదకరంగా పెరిగే అవకాశముందని అధికారులు ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో గత రెండు నెలల నమూనాలను పరీక్షించగా.. ఏప్రిల్ 25 నాటికి 9వేల 164మందికి పాజిటివ్ గా తేలింది. వీరిలో ఇప్పటివరకూ 7వేల270మందినే అధికారులు గుర్తించగలిగారు. మరో వెయ్యి 49మంది ఎక్కడున్నారనే విషయమే తెలియడం లేదు. వీళ్లంతా హోం ఐసోలేషన్ లో ఉన్నారా.. లేదా మరెక్కడికైనా వెళ్లారా అనే వివరాలు తెలియని పరిస్థితి. ఒక్క తిరుపతి పరిధిలోనే... పాజిటివ్‌గా తేలిన 845 మంది ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయినట్లు అధికార గణాంకాలు చెబుతున్నాయి.