Couple Death in Road Accident: వారిది నిరుపేద కుటుంబం. ఇద్దరు కుమారులతో సంతోషంగా జీవిస్తున్నారు. అంతలోనే చిన్న కుమారుడికి ప్రాణాంతక వ్యాధి సోకడంతో వారి కాళ్లకింద భూమి కంపించింది. వీరి గుండెకోతను అర్థం చేసుకున్న దాతలు ఏకంగా రూ.కోటి సాయం చేస్తామన్నారు. బిడ్డను బతికించుకుంటామనే ఆశ చిగురించింది. అంతలోనే అనూహ్య ప్రమాదం వారిద్దరినీ కబళించింది. చిన్నారి తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు.
తమిళనాడు రాష్ట్రం రాణిపేట జిల్లా కళ్లిపట్టుకు చెందిన బాలమురుగన్(45), సెల్వి(36) దంపతులకు ఇద్దరు కుమారులు. వీరి కుటుంబం కూలీ చేసుకుంటూ చాలారోజులుగా బెంగళూరులోనే ఉంటోంది. నాలుగేళ్ల చిన్న కుమారుడికి ప్రాణాంతక వ్యాధిని గుర్తించారు. చిన్నకుమారుడి పేరు తెలియాల్సి ఉంది. చికిత్సకు బెంగళూరులోని ఓ సంస్థ కోటి రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించింది. ఆ సొమ్ముతో చికిత్స చేయించేందుకు ఆ కుటుంబం సిద్ధమైంది. పెద్దబాబును బెంగళూరు కత్రిగుప్పెలోని తాత వద్ద ఉంచి, శుక్రవారం తమిళనాడులోని స్వగ్రామానికి వచ్చారు. కొంత డబ్బును సమకూర్చుకున్నాక కళ్ల్లిపట్టు నుంచి బంధువులున్న చిత్తూరు జిల్లా బలిజకండ్రిగ చేరుకుని.. ఆదివారం రాత్రి 9.30 గంటలకు కేఎస్‌ఆర్టీసీ బస్సులో బెంగళూరుకు ప్రయాణమయ్యారు.