ప్రపంచ మానవాళిని వణికించిన కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు దేశీయంగా రూపొందించిన కోవిడ్ టీకా పంపిణీ కార్యక్రమం చిత్తూరు జిల్లాలో ప్రారంభమైంది. తొలి విడతలో 29 కొవిడ్ టీకా కేంద్రాల ద్వారా రోజుకు 2900 మంది ఆరోగ్య సిబ్బందికి టీకా వేయడానికి ఏర్పాట్లు చేశారు. జిల్లాకు చేరుకున్న 41,500 డోసుల టీకాలను 37,703 మందికి అందించేందుకు అధికారులు జాబితాను సిద్ధం చేశారు.
తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో..
తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రారంభించారు. మహమ్మారి సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి సేవలందించిన ఆరోగ్య శాఖ సిబ్బంది నిజమైన దేవుళ్లని ఉప ముఖ్యమంత్రి అన్నారు. టీకా వేసుకున్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యులను అడిగి తెలుసుకోవాలని చెప్పారు. కరోనా వ్యాక్సిన్‌పై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని సూచించారు. మొదట విడతలో వైద్య సిబ్బంది, రెండో విడతలో పోలీసులకు వ్యాక్సిన్‌ను అందించేలా కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని తెలిపారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచిన వైద్యులు.. అదే స్పూర్తితో ప్రజలందరికీ టీకా అందేవరకు పనిచేయాలని కోరారు. జిల్లాకు 41,500 డోసుల కరోనా టీకాలు వచ్చాయని అన్నారు. వీటిని జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 29 కేంద్రాల ద్వారా అందించనున్నట్లు పేర్కొన్నారు.
గంగాధర నెల్లూరు నియోజకవర్గం..
గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని కార్వేటి నగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొవిడ్ టీకా పంపిణీ కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రారంభించారు. మొదటిగా స్థానిక ఆరోగ్య కేంద్రంలో ఏఎన్ఎంగా విధులు నిర్వర్తిస్తున్న హైమావతికి వైద్యులు టీకాను వేసి.. పరిశీలనలో ఉంచారు. రక్తపోటు, అలర్జీ వంటి అంశాలను పరిశీలించారు. వైద్యుల సూచనల మేరకు.. నలభై సంవత్సరాలు పైబడిన, ఇతర వ్యాధులతో బాధ పడుతున్నవారికి వ్యాక్సిన్‌ను అందించేందుకు వైద్య శాఖ సిద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి అన్నారు. ఈ టీకాను మొదటి విడతగా వైద్య సిబ్బందికి, అనంతరం రెవెన్యూ, పోలీసు యంత్రాంగాలకు వేయనున్నామని తెలిపారు. వ్యాక్సిన్ వేసుకున్న ప్రతి ఒక్కరూ రెండో దశ టీకాలు తప్పనిసరిగా వేసుకోవాలని సూచించారు. ప్రజల కోసం ప్రభుత్వం చేపడుతున్న సేవలను గుర్తించాలని పేర్కొన్నారు.
శ్రీకాళహస్తిలో..
శ్రీకాళహస్తిలోని ఏరియా ఆసుపత్రిలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. మహమ్మారిని జయించేందుకు వ్యాక్సినేషన్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే అన్నారు. కొవిడ్ కాలంలో ప్రాణాలకు తెగించి సేవలందించిన వైద్యసిబ్బందికి అభినందనలు తెలిపారు. ఆసుపత్రిలోని మహిళా సిబ్బందికి తొలి టీకా వేసిన వైద్యులు.. అనంతరం.. మిగిలిన సిబ్బందికి వ్యాక్సిన్‌ను అందించారు.
శాంతిపురం, గుడుపల్లె మండల కేంద్రాల్లో..
శాంతిపురం, గుడుపల్లె మండలాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కొవిడ్ టీకా పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిదులు ప్రారంభించారు. మొదటగా వైద్య సిబ్బంది, అంగన్వాడి కార్యకర్తలు, సహాయకులకు కరోనా టీకాలను అందించారు.