చిత్తూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. సోమవారం వరకు 73 మందికి కరోనా సోకగా.. రాష్ట్ర ప్రభుత్వం మంగవారం విడుదల చేసిన బులిటెన్‌లో 74కు చేరింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 16 మంది చికిత్స పూర్తిచేసుకుని డిశ్ఛార్జి కాగా.. యాక్టివ్ కేసులు 58 ఉన్నాయి. శ్రీకాళహస్తిలో పట్టణంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల స్వాబ్స్ నమూనాలు ఇటీవల పరీక్షించగా.. పోలీసు, రెవెన్యూ ఉద్యోగుల్లో కొందరికి పాజిటివ్‌గా తేలింది. వీరంతా ప్రస్తుతం ఐసోలేషన్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు. 22వ తేదీన పాజిటివ్‌గా తేలిన రెవెన్యూ ఉద్యోగి పదేళ్ల కుమార్తెకు సోమవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. ఇప్పటికే ఆ కుటుంబ సభ్యులు క్వారంటైన్‌లో ఉండగా.. ఆ బాలికను చిత్తూరులోని జిల్లా కొవిడ్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇక్కడ 16 మంది చికిత్స పొందుతున్నారు. శ్రీకాళహస్తిలో ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులకు సంబంధించి వేర్వేరుగా పరీక్షలు చేస్తున్నందునే ఫలితర రావడానికి నాలుగు రోజుల సమయం పట్టిందని అధికారులు చెబుతున్నారు. ఈ రెవెన్యూ అధికారి పనిచేసేది శ్రీకాళహస్తిలో అయినా.. నివాసం బీఎన్ కండ్రిగ కావడంతో.. ఈ కేసును ఆ ప్రాంతంలో చూపారు. బాలికతో కలిసి అక్కడ రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
పటిష్ఠంగా లాక్‌డౌన్
శ్రీకాళహస్తిలో లాక్‌డౌన్‌ను డీఎస్పీ నాగేంద్రుడు, పట్టణ సీఐ నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో పటిష్ఠంగా అమలు చేస్తున్నారు. ఇక్కడే 44 కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమై ఎవరినీ ఇళ్ల నుంచి వెలుపలికి రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. నిత్యావసర వస్తువులు, మందులు ఆర్డర్లపై ఇళ్లకు చేరవేస్తున్నారు. ఐదు రోజులుగా మున్సిపాలిటీ పరిధిలో పూర్తిగా జనజీవనం స్తంభించిపోయింది. స్థానికంగా రోజుకు 70 నుంచి 80 వరకు శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. సోమవారం కొందరు అనవసరంగా రోడ్లపై తిరుగుతుండగా.. పోలీసులు ఏరియా ఆస్పత్రిలోని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. ఇప్పటి వరకు 150 మందిపై కేసులు పెట్టి, 157 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.