చిత్తూరు జిల్లా తూర్పు మండలాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా పశ్చిమ మండలాల్లో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. వైరస్ వ్యాప్తిపై అధికారులు ఆరా తీస్తున్నారు. చంద్రగిరి మండలంలో మూడో దఫా సర్వేలో 20మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లుగా ప్రాథమిక సమాచారంతో నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించగా... రంగంపేటకు చెందిన 74ఏళ్ల వృద్ధుడికి పాజిటివ్ ఉన్నట్లు తేలింది. వృద్ధుడి కుమారుడు రేణిగుంటలోని ఓ సంస్థలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. మార్చి 30వ తేదీ వరకు అక్కడ విధులు నిర్వహించారు. అతనికి సైతం పరీక్షలు నిర్వహించారు. వృద్ధుడు ఉంటున్న ప్రాంతానికి మూడు ఇళ్ల దూరంలో దుబాయి నుంచి ఓ వ్యక్తి ఫిబ్రవరిలో వచ్చారు. అతని నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు బాధితుడు గత నెలలో ఆస్తమాతో ఇబ్బంది పడుతూ తిరుపతిలోని ప్రైవేటు ఆసుపత్రిలో పదిరోజులపాటు చికిత్స పొందగా ఆ ఆస్పత్రి వైద్యుల నుంచి సైతం స్వాబ్స్ స్వీకరించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు చిన్నగొట్టిగల్లుకు చెందిన మహిళకు సైతం పాజిటివ్ వచ్చింది. తాను ఎక్కడికీ వెళ్లలేదని సంత కోసం పక్కనే ఉన్న భాకరాపేటకు తప్ప మరో ప్రాంతానికి వెళ్లలేదని ఆమె చెబుతుండగా ఆమెకు వైరస్ ఎలా వచ్చిందో అధికారులు ఆరా తీస్తున్నారు.
కరోనా బుసలు... పట్టు వదలని అధికారులు - corona in chittor district
చిత్తూరు జిల్లాలో కరోనా మహమ్మారి చాప కింద నీరులా వ్యాపిస్తోంది. రోజు రోజకూ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కొన్ని కేసుల్లో కరోనా ఎలా వ్యాపించిందో అర్థం కావడం లేదు. దీంతో అధికారులు మరింత జాగ్రత్త పడి.. కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
మూడు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న కుప్పం ప్రాంతంలోని ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని జిల్లా పాలనాధికారి భరత్‌గుప్తా పేర్కొన్నారు. ఆదివారం కుప్పంలో పర్యటించిన ఆయన పీఈఎస్‌లోని ఐసోలేషన్ కేంద్రం, కుప్పం ఇంజినీరింగ్ కళాశాలలోని రిలీఫ్ కేంద్రాలను సందర్శించారు. రిలీఫ్ కేంద్రంలో ఉన్న 63 మందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి, వారిని ఇళ్లకు పంపిస్తున్నట్లు తెలిపారు. సరిహద్దు చెక్ పోస్టుల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులు స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి... రాష్ట్రంపై కరోనా పంజా.. 1100 చేరువలో కేసులు