కార్మికులకు థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్న భద్రతా సిబ్బంది
శ్రీసిటీ పారిశ్రామికవాడ పరిధిలో సుమారు 120 పరిశ్రమలు ఉత్పత్తులు సాగిస్తున్నాయి. సమీపంలో 16 గ్రామాల వారు నివాసాలు ఉంటున్నారు. తమిళనాడులో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. అక్కడి నుంచి వచ్చే కార్మికులతో కలిసి చిత్తూరు, నెల్లూరు జిల్లాకు చెందిన వారు విధులు నిర్వహిస్తున్నా.. కేసులు నమోదు కావడం లేదంటే.. శ్రీసిటీ నిర్వాహకులు తీసుకుంటున్న జాగ్రత్తలే.
కరోనా వైరస్ కారణంగా మార్చి, ఏప్రిల్ మాసాల్లో శ్రీసిటీ సమీప గ్రామాల నుంచి కార్మికులు పరిశ్రమల్లో విధులు నిర్వహించేందుకు ఆసక్తి కనబరచకపోవడం, పల్లెల్లో కొందరు ముళ్ల కంచెలు వేసి గ్రామస్థులు ఎవరు బయటకు వెళ్లకూడదంటూ నిబంధనలు విధించడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. వాటిపై దృష్టి సారించిన శ్రీసిటీ పారిశ్రామికవాడ ఎండీ రవీంద్రసన్నారెడ్డి, పరిశ్రమల ప్రతినిధులు అనుమానాల నివృత్తికి కృషి చేశారు. అతి కొద్ది మంది కార్మికులు వస్తున్నా వారందరికీ పరిశ్రమల్లోకి వెళ్లకముందే తనిఖీ కేంద్రాల వద్ద థర్మల్ స్క్రీనింగ్ చేయడం, భౌతిక దూరం పాటిస్తూ కార్మికులను బస్సుల్లో తరలించడం, బస్సు ఎక్కే ముందు శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకునేలా చర్యలు తీసుకున్నారు. పరిశ్రమల్లోకి వెళ్లిన అనంతరం ప్రతి కార్మికుడికి మధ్య ఆరు అడుగుల దూరం ఉండేలా చూసి కార్మికులతో పనులు చేయించారు.