సరిగ్గా పదిహేను రోజుల క్రితం చిత్తూరు జిల్లా సరిహద్దున ఉన్న చెన్నై కోయంబేడు మార్కెట్ రైతులు, వ్యాపారులతో కళకళలాడింది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో కరోనా హాట్‌స్పాట్‌గా మారింది. ప్రస్తుతం మదనపల్లె టమోటా మార్కెట్ పరిస్థితి కూడా అదేవిధంగా మారింది.
లాక్డౌన్ సమయంలోనూ రైతులు తమ పంటలను మార్కెటింగ్ చేసుకునే విధంగా కేంద్రం సడలింపులు ఇచ్చింది. దీంతో రాష్ట్రంలోనే అతిపెద్ద మార్కెట్ అయిన మదనపల్లె మార్కెట్‌కు నిత్యం టన్నుల్లో టమోటా వస్తోంది. ఇందులో పొరుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో రోజుకు 1300 మెట్రిక్ టన్నుల టమోటా ఇక్కడకు వస్తోంది. అన్లోడింగ్, గ్రేడింగ్ పనులతో మార్కెట్ హడావిడిగా మారింది. భౌతిక దూరం, మాస్కులు వేసుకోవడం, హమాలీల కోసం శానిటైజర్ల నిర్వహణ కచ్చితంగా అమలవుతున్న దాఖలాలు కనిపించడం లేదు.