టమాటా సాగుకు పేరుపొందిన చిత్తూరు జిల్లా రైతుల జీవితాలను లాక్‌డౌన్ పరిస్థితులు ఛిద్రం చేశాయి. లాక్‌డౌన్ కారణంగా క్రిమి సంహారకాలు దొరక్క కళ్ల ముందే వైరస్‌లు, పురుగులకు పంట ఆహారంగా మారిపోతున్నా రైతులు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు. కొద్దో గొప్పో మిగిలిన పంటను తీసుకొని మార్కెట్‌కెళ్లినా... రైతులను ధరల పతనం పూర్తిగా కుంగదీసింది. టమాటా పెట్టె 40 రూపాయలకు మించి ధర పలకలేదు. పైసా కూడా చేతికి రాలేదు సరికదా... రవాణా, కూలీ ఖర్చులు తిరిగి భరించాల్సిన దుస్థితి నెలకొంది. రాత్రీపగలూ శ్రమించి సాగుచేసిన టమాటా పంటను తన చేతులతో తానే ధ్వంసం చేస్తున్న దృశ్యాలు రైతన్నల గుండెకోతకు అద్దం పడుతున్నాయి.
టమాటా సాగులో చిత్తూరు జిల్లా జాతీయ స్థాయిలోనే ముందువరుసలో ఉంటుంది. ఖరీఫ్, రబీ సీజన్లు కలిపి సుమారు లక్షన్నర ఎకరాల్లో సాగవుతూ 35వేల రైతు కుటుంబాలకు ఈ పంట జీవనాధారంగా ఉంది. పుంగనూరు, సోమల, మదనపల్లె, సదుం, కల్లూరు, కలికిరి, పీలేరు, రామసముద్రం, తంబళ్లపల్లె ఇలా జిల్లాలోని పడమటి మండలాల్లో, ప్రతి గ్రామంలోనూ రైతన్నలు టమాటా పండిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో లాక్‌డౌన్ కారణంగా తలెత్తిన సంక్షోభం రైతుల పాలిట మరణ శాసనంగా మారింది. పుంగనూరు మండలం బైరా మంగళంలో బలవన్మరణానికి పాల్పడిన టమాటా రైతు నాగరాజు విషాదగాథే ఇందుకు నిదర్శనం. 5 లక్షలు అప్పు చేసి టమాటా పండించిన ఆ రైతు... రూపాయి కూడా తిరిగొచ్చే పరిస్థితి లేక బెంగతో తనువు చాలించాడు.