ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాడు కరోనా కష్టం.. నేడు నివర్ నష్టం - నివర్ సైక్లోన్ న్యూస్

పుంగనూరు మండలం చండ్రమాకుపల్లి పంచాయతీ గానుగలగద్దలో రైతు వేమారెడ్ఢి 2.05 ఎకరాల్లో టమోటా సాగు చేశారు. ఎకరాకు రూ.80వేలు ఖర్చు అయ్యింది. బ్యాంకు నుంచి రుణం తీసుకొని పంట వేశారు. అక్టోబరు నెలలో తొలి కోతకోయగా.. రూ.70వేలు చేతికొచ్చింది. నివర్‌ తుపానుకు టమోటా పంట మొత్తం దెబ్బతింది. వర్షాలకు పెట్టిన పెట్టుబడి కూడా దక్కలేదని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క వేమారెడ్డే కాదు.. ఇలాంటి రైతులు 706 మంది నివర్‌ తుపాన్‌తో నష్టపోయారు..

Corona difficulty today Nivar loss today
నాడు కరోనా కష్టం నేడు నివర్ నష్టం

By

Published : Dec 2, 2020, 7:06 AM IST

చిత్తూరు జిల్లా టమోటా పంటకు పెట్టింది పేరు. 35వేల హెక్టార్లలో సాగు చేస్తారు. పశ్చిమ ప్రాంతం నుంచి దేశ విదేశాలకు పంట ఉత్పత్తులు ఎగుమతులు జరుగుతుంటాయి. అంతటి ప్రాధాన్యం ఉన్న పంటను సాగుచేసే రైతన్నకు అడుగడుగునా కష్టాలు ఎదురవుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో కరోనా కారణంగా అమలు చేసిన లాక్‌డౌన్‌తో ఎగుమతులు నిలిచిపోయాయి. ఫలితంగా జిల్లాలో పండించిన పంట అంతా ఇక్కడే విక్రయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లా పరిధిలో రవాణా సౌకర్యాలు అంతంతమాత్రంగా ఉండటం.. కొంత సమయం మాత్రమే అమ్ముకోవాలనే ఆంక్షలు విధించడంతో అధిక శాతం మంది దిగుబడిని విక్రయించుకోలేకపోయారు. దీనికితోడు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రవాణాకు పెట్టిన ఖర్చులు కూడా రాలేదు. నిరాశ చెందిన పడమటి ప్రాంత రైతులు పొలాల్లోనే పంటను వదిలేశారు. చాలాచోట్ల పశువులకు గ్రాసంగా ఉపయోగించారు. గత నెలలో వచ్చిన నివర్‌ తుపాను వీరిని నష్టాల్లోకి నెట్టింది. మదనపల్లె, గుర్రంకొండ, తంబళ్లపల్లె, పుంగనూరు, సోమల, కురబలకోట, పుంగనూరు, కలకడ, నిమ్మనపల్లె, చౌడేపల్లె, రామసముద్రం, కలికిరి, సదుం మండలాల రైతులు ఎక్కువగా నష్టపోయారు.

ఈదురు గాలులు.. కూలిన కర్రలు

టమోటాకు నష్టం వాటిల్లకుండా ఉండేందుకు జిల్లాలో కర్రల విధానంపై పంట సాగు చేపడతారు. ఇందుకు అవసరమైన కర్రలను ప్రకాశం జిల్లా, కర్ణాటక నుంచి తెచ్చుకుంటారు. ఒక్కో కర్రను రూ.14 నుంచి రూ.15కు కొనుగోలు చేస్తారు. గతనెల 25, 26 తేదీల్లో నివర్‌ తుపాను కారణంగా వీచిన ఈదురుగాలులకు వీటిలో చాలావరకు విరిగిపోయాయి. ఫలితంగా టమోటా మొక్కలు నేలవాలాయి. కాయలు నేల రాలిపోయాయి.

పొలాల్లో నీరు నిలిచి..

భారీ వర్షాల కారణంగా వంకల నుంచి వచ్చిన ప్రవాహంతో పంట పొలాల్లో నీరు నిలిచిపోయింది. రెండు రోజులకుపైగా ఇదే పరిస్థితి ఉండటంతో మొక్కలు చనిపోయే అవకాశం ఉంది. కాయలోని గుజ్జు ఎండిపోయి.. నాణ్యత దెబ్బతింటోంది. ఫలితంగా అటు సాగు మొత్తం దెబ్బతినడంతోపాటు దిగుబడులు గణనీయంగా తగ్గుముఖం పట్టనున్నాయి. మరోసారి పంట సాగు చేయాలంటే అన్నదాతకు శక్తిని మించిన పని కానుంది. ఈ ఏడాది ఒక్కో ఎకరానికి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు కర్షకుడికి నష్టం వాటిల్లిందని రైతు సంఘాల నాయకులు పేర్కొంటున్నారు.

దెబ్బతీసిన వాతావరణ మార్పులు

కరోనా కారణంగా వచ్చిన లాక్‌డౌన్‌తోపాటు వాతావరణ మార్పులు అన్నదాతను ఆర్థికంగా దెబ్బతీశాయి. ప్రధానంగా ఊబి ఈగ గుడ్లను నివారించడానికి పురుగు మందులు ఎక్కువగా పిచికారీ చేయాల్సి వచ్చింది. వీటికే సుమారు రూ.25వేలు- రూ.35వేలు వెచ్చించారు. రెండేళ్లుగా ఈ సమస్య రైతులను వెంటాడుతోంది. వాతావరణ మార్పుల వల్లే గజ్జి వచ్ఛి. కాయలపై నల్లటి మచ్చ ఏర్పడుతున్నాయి. దీంతో ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. ఓవైపు కరోనా.. మరోవైపు వాతావరణ మార్పులు.. ఇప్పుడు నివర్‌ తుపాను అన్నదాతను నట్టేట ముంచాయి. అధిక వర్షపాతానికి మొక్కలు చనిపోయే పరిస్థితి ఉండటంతో మరోసారి సాగుకు పెట్టుబడి రూ.లక్షల్లో ఖర్చుకానుంది. దుక్కులు దున్నడం, నారు, కర్రల కొనుగోలు, మల్చింగ్‌కు అదనంగా డబ్బులు చెల్లించాలి. అన్నింటికన్నా ప్రధానంగా పంట సాగుకు కనీసం రెండు నెలల వ్యవధి ఉండాలి. లేనిపక్షంలో భూమిపై తేమ అలాగే ఉండి.. గతంలో చెట్లకు సోకిన తెగుళ్లు ఈసారి మొక్క దశ నుంచే వ్యాపించే పరిస్థితి ఉంది. అప్పుడు పురుగు మందులు, ఎరువులకు మరింత పెట్టుబడి అవసరం.

జిల్లాలో టమోటా పంట దెబ్బతిన్న మండలాలు 09

గ్రామాలు 71

రైతులు 707 మంది

విస్తీర్ణం 1048 ఎకరాలు

నష్టం రూ.6.28 కోట్లు


ఇదీ చదవండి:

ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలకు అనుకూల పరిస్థితుల్లేవు

ABOUT THE AUTHOR

...view details