ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సరిహద్దు.. వైరస్ కు పొద్దు! - CORONA UPDATES AT CHITTOR DISTRICT

చిత్తూరు జిల్లాలో నెలరోజులుగా దాదాపు రెండు వేల నుంచి మూడు వేల వరకు కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగు చూస్తున్నాయి. రోజువారీ మరణాలు కూడా 15 వరకు ఉంటున్నాయి. ఇందులో అధిక శాతం గ్రామాల్లోనే వెలుగు చూస్తుండడం కలవరానికి గురిచేస్తోంది. రాష్ట్ర సరిహద్దుల్లో కొవిడ్‌ నిబంధనల ఉల్లంఘన జరుగుతోంది. రెండు రాష్ట్రాల నుంచి జిల్లాకు నిత్యం వేలాది మంది వాహనాల్లో రాకపోకలు సాగిస్తున్నారు. ప్రధాన మార్గాలతో పాటు చిన్నపాటి మార్గాల్లో అడ్డుకునేందుకు వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో రాకపోకలు సులభంగా సాగిపోతున్నాయి. ఫలితంగా పల్లెల్లో వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతోంది.

CORONA CASES AT CHITTOR DISTRCIT
CORONA CASES AT CHITTOR DISTRCIT

By

Published : May 31, 2021, 12:17 PM IST

చిత్తూరు జిల్లా సరిహద్దులోని తమిళనాడు రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తోంది. నిత్యం 35 వేల వరకు కొత్త కేసులు నమోదు కావడంతో పాటు దాదాపు 500 వరకు ప్రాణాలు కోల్పోతున్నారు. కర్ణాటక రాష్ట్రంలో కొత్తగా 22 వేల వరకు కేసులు నమోదు కావడంతో పాటు 600 మంది వరకు ఈ మరణాలు సంభవిస్తున్నాయి. పరిస్థితిలో రెండు రాష్ట్రాల నుంచి జిల్లాకు నిత్యం వేలాది మంది వాహనాల్లో రాకపోకలు సాగిస్తున్నారు. తమిళనాడు నుంచి నగరి, గుడిపాల, తిరుత్తణి, యాదమరి, కర్ణాటక నుంచి పలమనేరు, మదనపల్లె పరిసరాల్లో ప్రధాన మార్గాలతో పాటు చిన్నపాటి రహదారులు పదుల సంఖ్యలో ఉన్నాయి. వీటి నుంచి వచ్చేవారిని అడ్డుకునే వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో రాకపోకలు సులభంగా సాగిపోతున్నాయి. ఫలితంగా జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది.

అడ్డదారుల్లో వచ్చేస్తున్నారు

కరోనా కట్టడికి రాష్ట్ర సరిహద్దులో నంగలి దగ్గర పోలీసులు చెక్‌పోస్టును ఏర్పాటు చేశారు. లాక్‌డౌన్‌ సడలించిన సమయాల్లో కరోనా రోగులు రాష్ట్రంలోకి వాహనాల్లో వచ్చేస్తున్నారు. చెక్‌పోస్టులు తగలకుండా కర్ణాటక నుంచి రాష్ట్రంలోని రావడానికి పలుదారులు ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రానికి చెందిన నంగలి పట్టణం నుంచి దాసార్లపల్లెమీదుగా బైరెడ్డిపల్లె చేరుకుని అటు నుంచి జిల్లాలోకి.. పెద్దపంజాణి మండలంలోని ఉగిని, కుక్కలపల్లె, పసుపత్తూరు గ్రామాల మీదుగా వచ్చేస్తున్నారు. వి.కోట కృష్ణాపురం దగ్గర చెక్‌పోస్టు ఉన్నా పెద్దగా ఎవరూ తనిఖీలు నిర్వహించడం లేదు.

నగరిలో 11 దారులు..

నగరి, సత్యవేడు నియోజకవర్గాల పరిధిలో అత్యధిక గ్రామాలు తమిళనాడు సరిహద్దులో ఉన్నాయి. చెన్నై నుంచి, తిరువళ్లూరు, తిరుత్తణి, పళ్లిపట్టు వాసులు జిల్లాలోకి హద్దులు దాటుతున్నారు. నగరి నియోజకవర్గంలో నగరి, విజయపురం మండలా పరిధిలో నగరి-నెల్లాటూరు, నగరి-పొద్దుటూరుపేట, పళ్లిపట్టువైపు నుంచి సత్రవాడ- కరియంబేడు, పుత్తూరు మండలంలో వేపగుంట క్రాస్‌ నుంచి పళ్లిపట్టు వైపు, విజయపురంలో కనకమ్మసత్రం మార్గం, ఎన్‌.ఎన్‌.కండిగ మార్గం నుంచి వాహనాలు తరలి వస్తున్నాయి. తమిళనాడులో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ కావడంతో మద్యం కోసం నిత్యం ద్విచక్రవాహనాలపై నగరి, విజయపురం వస్తున్నారు. తిరుపతి-చెన్నై జాతీయ రహదారిలో తడుకుపేట వద్ద చెక్‌పోస్ట్‌ వద్ద మాత్రమే నియంత్రణ కనిపిస్తోంది. సత్యవేడు నియోజకవర్గంలో ఊతుకోట నుంచి సురుటుపల్లి, నాగలాపురం, పిచ్చాటూరు వైపు అధికంగా తిరువళ్లూరు జిల్లా నుంచి స్థానికేతరులు తరలి వస్తున్నారు. నగరి నియోజకవర్గం పరిధిలో 11 గ్రామీణ మార్గాలున్నాయి. ఈ కారణంగా ఈ నియోజకవర్గంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది.

తనిఖీ చేసుంటే ఆ కుటుంబం బతికుండేది

మదనపల్లె డివిజన్‌లో ఆరు ప్రాంతాల్లో ఆంధ్ర- కర్ణాటక సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. మదనపల్లె గ్రామీణ మండలం చీకలబైలు వద్ద మదనపల్లె-బెంగళూరు హైవేలో పోలీసులు చెక్‌పోస్టు ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీ చేస్తున్నారు. కర్ణాటక నుంచి ద్విచక్రవాహనాల్లో వచ్చేవారికి అనుమతి ఉందా..? లేదా అని చూడకుండా మదనపల్లెలోకి అనుమతి ఇస్తున్నారు. ఈనెల 29వ తేదీ రాత్రి ద్విచక్రవాహనంపై వస్తున్న ఓ కుటుంబాన్ని అలాగే వదిలేయడం వల్ల గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లి పోయింది. ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. వీరిని చెక్‌పోస్టు వద్దనే కట్టడి చేసి ఉంటే ప్రమాదం జరిగి ఉండేది కాదని స్థానికులు అంటున్నారు.

కఠినంగా కట్టడి చేస్తాం

అక్రమ రవాణా కట్టడికి వినియోగించే చెక్‌పోస్టులను ప్రస్తుతం ఇతర రాష్ట్రాల వ్యక్తుల కదలికలను తనిఖీ చేయడానికి వినియోగిస్తున్నాం. అనుమతి ఉన్న వ్యక్తులు మినహా ఇతరులు జిల్లాలోకి రాకుండా కఠినంగా కట్టడి చేస్తాం. ఈ మేరకు చెక్‌పోస్టుల తనిఖీ యంత్రాగానికి ఆదేశాలిచ్చాం. చిన్నపాటి మార్గాలను సైతం మూసివేయిస్తాం. - హరి నారాయణన్‌, కలెక్టర్

ఇదీ చదవండి:

కరోనాతో విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు కోటయ్య మృతి

ABOUT THE AUTHOR

...view details