చిత్తూరు జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. జిల్లాలోని పలు ప్రాంతల్లో అనధికారిక లాక్‌డౌన్ అమలవుతోంది. పాజిటివ్ కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వ యంత్రాంగం.. వైరస్ వ్యాప్తి నివారణకు విస్తృత చర్యలు చేపడుతోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు మాత్రమే వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. నిత్యావసరాలకు అధికప్రాధాన్యమిచ్చిన అధికారులు మిగిలిన వ్యాపార, వాణిజ్య సంస్ధలను మూసివేస్తున్నారు.
కేసులు పెరుగుతున్నందున వైద్యసేవల కోసం అవసరమైన ఆస్పత్రుల్లో బెడ్ల సంఖ్య పెంచడానికి కసరత్తు ప్రారంభించారు అధికారులు. తిరుపతి నగరంలో కరోనా సోకిన నగర వాసులకు వైద్యసేవలు అందించడానికి ప్రత్యేకంగా తితిదే పరిధిలోని శ్రీనివాసం వసతి సముదాయాన్ని వినియోగిస్తున్నారు. జిల్లాలోని ఇతర ప్రాంతాల కరోనా రోగులను పద్మావతి నిలయం, వికృతమాల కోవిడ్ కేర్ సెంటర్లలో చేర్చి వైద్యసేవలు అందిస్తున్నారు. తిరుపతిలోని రుయా, స్విమ్స్, చిత్తూరు కొవిడ్ ఆసుపత్రులతో పాటు పద్మావతి నిలయం, శ్రీనివాసం, వికృతమాల కొవిడ్ కేర్ సెంటర్లలో 3500 పడకలను సిద్ధం చేశారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 3074 పాజిటివ్ కేసులు నమోదవగా 29 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది.