ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోయంబేడుకు తోడు కువైట్‌ కేసులు - చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు

జిల్లాపై కరోనా ప్రభావం కొనసాగుతూనే ఉంది. ఓ వైపు తమిళనాడులోని కోయంబేడు నుంచి వచ్చిన వారి నుంచి పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండగా... తాజాగా కువైట్‌ నుంచి వచ్చినవారికి సైతం కరోనా వైరస్‌ వ్యాపించినట్లు అధికారులు గుర్తించారు.

Breaking News

By

Published : May 26, 2020, 5:03 PM IST

చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. సోమవారం జిల్లా వ్యాప్తంగా 11 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇందులో నాగలాపురం నుంచి నలుగురికి.. శ్రీకాళహస్తి నుంచి ఇద్దరు, తిరుపతి అర్బన్‌ పరిధిలో ఒకరికి కరోనా వచ్చినట్లు నిర్ధారించారు. పాజిటివ్‌ కేసుల్లో ఐదుగురురికి కోయంబేడు ప్రాంతం నుంచి వచ్చిన వారివల్ల వ్యాపించిందని సోమవారం రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ అధికారులు విడుదల చేసిన బులిటెన్‌లో స్పష్టం చేశారు.

ఇటీవలే ప్రత్యేక విమానం ద్వారా కువైట్‌ నుంచి వచ్చిన వారిలో నలుగురికి పాజిటివ్‌ వచ్చినట్లు తేలింది. ఇందులో కేవీపల్లెకు చెందిన ముగ్గురు ఉండగా చిన్నగొట్టిగల్లు ప్రాంతానికి చెందిన ఒకరు ఉన్నారు. నలుగురు ప్రత్యేక క్వారంటైన్‌ కేంద్రంలో ఉండటంతో ఇతరులకు వ్యాప్తి చెందేందుకు ఆస్కారం లేదని అధికారులు తెలిపారు. జిల్లా పరిధిలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 249కు చేరుకుంది.

73కు చేరిన కరోనా కేసులు

కరోనా మరింత వేగంగా వ్యాప్తి చెందడం అధికారులు, ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. సీఏ విద్యార్థికి ఈ నెల 11వ తేదీన పాజిటివ్‌గా అధికారులు నిర్ధారణ చేశారు. అతని కారణంగా కుటుంబీకులు, స్నేహితులు ఇలా పలువురికి ఈ వైరస్‌ సోకింది. అక్కడితో ఆగకుండా వాళ్లు నివాసముంటున్న ప్రదేశంలో పలువురూ ఈ వైరస్‌కి గురికావడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

తాజాగా బహుదూరుపేటకు చెందిన అరవై ఏళ్లు దాటిన ఇద్దరు వ్యక్తులు ఈ వైరస్‌కి గురికావడంతో అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వైరస్‌ సోకిన వారిని తిరుపతి ఐసోలేషన్‌కు పంపారు. వాళ్ల బంధువర్గీయులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. 11వ తేదీన సీఏ విద్యార్థికి నిర్ధారణ అయితే ఇప్పటి వరకు ఆ పరిసర ప్రాంతాల్లో 22 మందికి సోకడం గమనార్హం. ఈమూలాలు మరింత విస్తృతం కాకుండా ఎక్కడికక్కడ నియంత్రించాలన్న ఉద్దేశంతో ప్రస్తుతం అక్కడే వైద్య పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసి భారీఎత్తున ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

11 మందికి కరోనా ప్రిజెంటివ్‌ పాజిటివ్‌

ముంబయి రెడ్‌జోన్‌ నుంచి చిత్తూరుకు వచ్చిన 120 మంది నగరి వాసులలో 11 మందికి కరోనా ప్రిజెంటివ్‌పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. నగరికి చెందిన వారు ముంబయిలో స్థిరపడి.. లాక్‌డౌన్‌ కారణంగా రెండ్రోజుల కిందట అక్కడినుంచి తిరిగి సొంత ప్రాంతానికి వచ్చిన వారికి జిల్లా కొవిడ్‌ ఆస్పత్రి నోడల్‌ అధికారి జయరాజన్‌ కరోనా పరీక్షలు నిర్వహించారు. వారిలో 11 మందికి ప్రిజెంటివ్‌ పాజిటివ్‌గా తేలింది. దీంతో వారిని చిత్తూరు క్వారంటైన్‌కు తరలించారు.

మరో 37 మందికి స్వాబ్స్‌ స్వీకరణ...

గేటుపుత్తూరులోని గేటువీధిలో సోమవారం కరోనా లక్షణాలు కనిపించినట్లు నగరి నియోజకవర్గ నోడల్‌ అధికారి డాక్టర్‌ రవిరాజు ప్రకటించారు. చెన్నైలోని రాయపేటలోని ఓ హాటల్‌లో పనిచేసే మహిళ గత బుధవారం పుత్తూరుకు వచ్చిందని, ఆమె చిరునామా తెలుసుకొనిపరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. గేటు వీధిని రెడ్‌జోన్‌గా ప్రకటించారు.

స్విమ్స్‌, రుయా నుంచి పది మంది డిశ్ఛార్జి

రాష్ట్ర కొవిడ్‌ ఆస్పత్రి (స్విమ్స్‌) నుంచి కడప, గుంటూరు జిల్లాలకు చెందిన ఇద్దరు, జిల్లా కొవిడ్‌ ఆస్పత్రి-2 (రుయా) నుంచి జిల్లాకు చెందిన 8 మంది సోమవారం డిశ్ఛార్జి అయ్యారు. సంబంధిత వైద్యాధికారులు వీరికి డిశ్ఛార్జి సమ్మరీ అందజేశారు. స్విమ్స్‌ నుంచి కడప, గుంటూరు నుంచి ఒక్కొక్కరు, రుయా నుంచి సత్యవేడు మండలానికి చెందిన నలుగురు డిశ్ఛార్జి అయ్యారు. పిచ్చాటూరుకు ఒకరు, నాగలాపురం ఇద్దరు, వరదయ్యపాళెంకు చెందిన ఒకరు డిశ్ఛార్జి అయ్యారు.

కేసులను బట్టి సడలింపులు..

కేసుల సంఖ్య నానాటికి పెరుగుతోందని, ఈ పరిస్థితుల్లో కేసులను బట్టి ఇక్కడి సడలింపులపై నిర్ణయం తీసుకుంటామని జిల్లా పాలనాధికారి భరత్‌గుప్తా స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా శ్రీకాళహస్తి పట్టణంలో 73 కేసులు నమోదైనట్లు తెలిపారు. పెరుగుతున్న కేసులు కట్టడి చేసేందుకు బహుదూరుపేట, ఇమాంవీధుల్లో భారీ ఎత్తున వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. పరీక్షా కేంద్రాలను అక్కడే ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం ఇమాంవీధిలో కేసులు నమోదు కావడం లేదని, బహుదూరుపేటలో మాత్రం స్వల్పంగా కేసులు నమోదు అవుతున్నాయని తెలిపారు. నాలుగైదు రోజుల్లో పరీక్షలు పూర్తవుతాయని, అనంతరం ఏమేరకు సడలింపులు ఇవ్వాలన్న విషయమై నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రజలందరూ స్వీయ భద్రత పాటించాలని, ప్రస్తుత సమయం ఎంతో కీలకమని తెలిపారు. వైరస్‌ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

ఇదీ చదవండి:యూనిసెఫ్​నే ఆలోచింపజేసిన విశాఖ బాలుడి ప్రశ్న

ABOUT THE AUTHOR

...view details