చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులతోపాటు తితిదే వసతి గృహాలను కొవిడ్ కేంద్రాలుగా మార్చారు. అధికారులు వీటిల్లో చికిత్స అందించేందుకు 6367 పడకలు అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం 4660 యాక్టివ్ కేసులు ఉండగా వివిధ కొవిడ్ కేంద్రాల్లో 1077 మంది చికిత్స తీసుకుంటున్నారు. మరో 1465 మంది ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉండగా మిగిలిన 2118 మంది ఇంటి వద్దనే వైద్యం తీసుకుంటున్నారు. దీంతో ఈ లెక్కలను పరిశీలిస్తే ఇంకా 3825 పడకలు ఖాళీగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. గతంలో పోలిస్తే ఉద్ధృతి తగ్గడంతోపాటు ప్రజల్లో అవగాహన పెరిగి ఇంటి వద్దనే వైద్యం చేసుకునేందుకు ఇష్టపడుతున్నట్లు అధికారులు తెలిపారు. గోవిందరాజులస్వామి సత్రాల్లో ఏర్పాటు చేసిన కొవిడ్ కేంద్రాన్ని అధికారులు మూసివేసేందుకు సిద్ధమవుతున్నారు. వీటితోపాటు తితిదే నుంచి తీసుకున్న మరికొన్ని వసతి గృహాల్లోని కొవిడ్ కేంద్రాలను మూసివేసే అంశంపై అధికారులు పరిశీలిస్తున్నారు.
రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరుగుతున్న తొలి రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిని రాష్ట్రస్థాయి కొవిడ్ కేంద్రంగా ఏర్పాటు చేసింది. ఈ కేంద్రంలో మొత్తం 450 పడకలను అధికారులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇక్కడ 264 మంది వరకు చికిత్స తీసుకుంటున్నారు. గతంలో ఈ కేంద్రంపై తీవ్ర ఒత్తిడి ఉండేది. మరోవైపు తిరుపతిలోని శ్రీపద్మావతి నిలయంలో ఏర్పాటు చేసిన కొవిడ్ కేంద్రంలో చేరాలంటే పెద్ద ఎత్తున సిఫారసులు చేసుకోవాల్సి వచ్చేంది. ఇందులో సుమారు 876 పడకలను అధికారులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇక్కడ 425 మంది వరకు చికిత్స తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. శ్రీనివాసంలో 1670 పడకలకు ప్రస్తుతం 235 మంది బాధితులు మాత్రమే ఉన్నారు. ఇలా జిల్లా పరిధిలోని అన్ని కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని అధికారులు చెబుతున్నారు.