హనుమంతుడి జన్మ స్థలంగా తిరుమల కొండల్లోని అంజనాద్రిని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటిస్తూ నియమించిన పండిత పరిషత్ శ్రీరామనవమి రోజున చేసిన ప్రకటన.. అనంతర పరిణామాలు వేడిని రాజుకుంటున్నాయి. ఆంజనేయుడిని తమ వాడిగా ప్రకటించిన తితిదే పండిత కమిటీ తీరును నిరసిస్తూ.. తిరుమల పర్యటనలో భాగంగా తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో హనుమద్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఫౌండర్ ట్రస్టీ గోవిందానంద సరస్వతి సంవాదానికి దిగారు.
మహామహుల మధ్య 4 గంటల సంవాదం..
తితిదే కమిటీ నుంచి ఛైర్మన్, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఉపకులపతి మురళీధరశర్మ, ఎస్వీవేద అధ్యయన సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ, ఆచార్య రాణి సదాశివమూర్తి, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం వీసీ సన్నిధానం సుదర్శన శర్మ తదితరులు పాల్గొన్నారు. పంపాక్షేత్ర కిష్కింధ తరపున హనుమద్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఫౌండర్ ట్రస్టీ గోవిందానంద సరస్వతి ఒక్కరే పాల్గొనగా.. దాదాపు నాలుగు గంటల పాటు సంవాదం జరిగింది.
తితిదే కమిటీపై ఆగ్రహం..
ఇరు వర్గాలు తమ వద్దనున్న విషయాలపై చర్చ నిర్వహించాయి. అంజనాద్రి తిరుమల కొండల్లోనిదేనని తితిదే పండిత కమిటీ వివరించగా.. కిష్కింధనే మారుతి జన్మస్థలమని గోవిందానంద సరస్వతి విబేధించారు. చివరికి అంసపూర్తిగా చర్చ ముగియగా తితిదే పండిత కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. కిష్కింధ ట్రస్ట్ ఫౌండర్ ట్రస్టీ గోవిందానంద సరస్వతి మాత్రం తితిదే కమిటీ వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు.
ప్రామాణికత ఏదీ : గోవిందానంద
అసలు తితిదే నియమించిన పండిత కమిటీకి ప్రామాణికత ఏంటని ప్రశ్నించిన గోవిందానంద సరస్వతి.. తిరుపతి పెద్ద జీయర్ అనుమతి, అంగీకారం హనుమంతుడి ప్రకటన వెనుక ఉన్నాయా అని ప్రశ్నించారు. కంచికామకోటి పీఠం, శృంగేరీ శంకరాచార్యులు, మధ్వాచార్యులు, తిరుపతి జీయర్ స్వాములు ఇలా ఇంతమంది ఉండగా.. తిరుమలలోని దైవిక కార్యక్రమానికి సంబంధించిన అంశాన్ని పండిత కమిటీ ఏ అధికారంతో వెల్లడిస్తోందని నిలదీశారు.
రామాయణం ప్రకారం..
వాల్మీకీ రామాయణం ప్రామాణికంగా హనుమంతుడు జన్మించింది కిష్కింధలోనే అని మరోసారి చెబుతున్నామన్న గోవిందానంద సరస్వతి.. తితిదే కమిటీ చెబుతున్న పురాణాల దృష్టాంతాలు అన్నీ వారికి అనుకూలంగా అన్వయించుకుంటున్నారన్నారు. కంచిపీఠం, శృంగేరీ పీఠం, మధ్వాచార్యలు, తిరుపతి జీయర్ స్వాముల వద్దకు ఈ అంశాన్ని స్వయంగా తీసుకువెళ్తామన్న గోవిందానంద సరస్వతి.. వారే ఈ అంశంపై జోక్యం చేసుకోవాలని కోరుతామన్నారు. బహిరంగ చర్చ అని పిలిచి మీడియాను లోనికి అనుమతివ్వకుండా ఆంతరంగికంగా చర్చ జరపటంలో తితిదే ఆంతర్యం ఏమిటో అర్థం కావటం లేదని గోవిందానంద సరస్వతి ఆక్షేపించారు.