తితిదే ఆధ్వర్యంలో జూనియర్, డిగ్రీ, ప్రాచ్య కళాశాలలు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల, ఆయుర్వేద కళాశాలు ఉన్నాయి. వీటిల్లో ఒప్పంద గ్రంథాలయాలధికారుల కోసం తితిదే ఇంటర్వ్యూలు నిర్వహించి ఒక్కొక్కరి నుంచి రూ.10 వేలు డిపాజిట్ తీసుకుంది. 2007లో ఇద్దరికి, 2008లో ముగ్గురికి, 2016లో ఒక్కరికి బాధ్యతలు అప్పగించారు. కొన్ని కారణాలతో ఒక కళాశాల నుంచి మరొక కళాశాలకు బదిలీలు, ఇతర కళాశాలలకు అదనపు బాధ్యతలు అప్పగించి విధులు చేయించారు.
తితిదే అధికారుల విన్నపం మేరకు దేవాదాయ శాఖ 2019 నవంబరు 28వ తేదీన జీవో నెం.1411 విడుదల చేసింది. తితిదే కళాశాలల్లోని ఆరు గ్రంథాలయాధికారులు, ఆరు అసిస్టెంట్ గ్రంథాలయాధికారుల పోస్టులకు నాన్ టీచింగ్ సిబ్బంది అర్హత కలిగిన వారు పదోన్నతిపై బదిలీ(ఓన్ టైమ్ మెజర్)పై దరఖాస్తు చేసుకోవచ్చని జీవో సారాంశం. జీవో ద్వారా అర్హత కలిగిన తితిదే శాశ్వత నాన్ టీచింగ్ ఉద్యోగులు కళాశాలల్లో గ్రంథాలయ, అసిస్టెంట్ గ్రంథాలయాధికారులు 8 మంది, పాఠశాలలో ఇద్దరు ప్రస్తుతం పనిచేస్తున్నారు. నాన్ టీచింగ్ సిబ్బంది రాకతో ఒప్పంద గ్రంథాలయాధికారులు బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఒప్పంద సిబ్బంది దేవాదాయ శాఖ జారీ చేసిన జీవో తితిదే సర్వీస్ రూల్స్‌కు పూర్తిగా విరుద్ధమని, తమను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని 5 మంది కోర్టును ఆశ్రయించారు.