చిత్తూరు జిల్లాలో భవన నిర్మాణ కార్మికుల వృత్తి నైపుణ్యాల పెంపు లక్ష్యంగా.. శాంతిపురం మండలంలో ప్రభుత్వం నెలకొల్సిన న్యాక్ శిక్షణ కేంద్రం మూతపడటంతో అధునాతన భవన సముదాయం నిరుపయోగంగా మారింది.. కుప్పం ప్రాంత కార్మికులు బెంగళూరులో భవన నిర్మాణ పనులు చేపడుతుండగా.. వారితో పాటు జిల్లాలోని ఇతర ప్రాంత కార్మికులకు అందుబాటులో ఉచిత శిక్షణ కోసం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.. తాపీ మేస్త్రీ, ప్లంబర్, విద్యుదీకరణ తదితర పనుల్లో కార్మికుల నైపుణ్యాలను పెంపొందించారు.
శిక్షణకు స్వస్తి..
మండల పరిధి తుమ్మిశి రోడ్డులోని ‘కడ’ భవన సముదాయంలో కార్మికులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. రెండేళ్లుగా ఈ శిక్షణకు స్వస్తి పలకడంతో కార్మికులు వృత్తి నైపుణ్యతను పెంపొందించుకోలేని పరిస్థితి నెలకొంది. ఈ శిక్షణ కేంద్రం సిబ్బంది ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్లిపోయారు. దీంతో కేంద్రం మూతపడింది. వృత్తి నైపుణ్యత కోసం కార్మికులు ప్రస్తుతం ఎవరిని ఆశ్రయించాలో అంతుబట్టని దుస్థితి ఏర్పడింది.
రూ.16 కోట్ల వ్యయం..
న్యాక్ శిక్షణ కేంద్రానికి శాశ్వత భవన వసతి కోసం గత ప్రభుత్వ హయాంలో రూ.16 కోట్లు వెచ్చించారు. శాంతిపురం-గుడుపల్లె మండలాల సరిహద్దుల్లో గణేషపురం అటవీ ప్రాంత సమీపాన రెండేళ్ల క్రితం భవన సముదాయాన్ని నిర్మించారు. అప్పట్లో ఆధునిక పరిజ్ఞానంతో కేవలం ఆరు నెలల్లోనే అధునాతన హంగులతో ఆయా భవనాలు నిర్మించారు. కార్మికులకు శిక్షణ, వసతి కోసం భవన సముదాయాలు అందివచ్చాయి. సిబ్బంది కోసం నివాస గృహ సముదాయాలను సమకూర్చారు. గతేడాది జనవరి రెండో తేదీన నాటి సీఎం చంద్రబాబు న్యాక్ భవన సముదాయాన్ని ప్రారంభించారు.
మూతపడిన సముదాయం
ప్రారంభోత్సవానికే పరిమితమైన భవన సముదాయం చుట్టూ పిచ్చిమొక్కలు, ముళ్లపొదలు అల్లుకుపోతున్నాయి. ఈ భవనాల ప్రాంగణం విషసర్పాలకు నిలయమైంది. రూ.కోట్లలో ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేసినా కార్మికుల శిక్షణకు ఉపయోగపడని విధంగా భవనాలు చేరుకుంటున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం, పాలకులు స్పందించి ఈ శిక్షణ కేంద్రం పునఃప్రారంభానికి చర్యలు చేపట్టాలని కార్మికులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: నేడు బాలా త్రిపుర సుందరీదేవిగా బెజవాడ దుర్గమ్మ