ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ధరల పెంపును నిరసిస్తూ... రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు - Congress party protest news in chittoor district

పెరిగిన నిత్యావసర, పెట్రోల్ ధరలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేపట్టింది. భాజపా అధికారంలోకి వచ్చాక రూ.60 ఉన్న పెట్రల్ ధరను 110కి పెంచారని నేతలు విమర్శించారు. రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డిది చెత్త పరిపాలన అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Congress party protests
కాంగ్రెస్ పార్టీ నిరసనలు

By

Published : Jul 15, 2021, 7:36 PM IST

పెట్రోల్, నిత్యావసర వస్తువుల ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. పెట్రోల్, డీజిల్​లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావలని డిమాండ్ చేశారు.

చిత్తూరు జిల్లాలో..

పెరిగిన నిత్యావసర, పెట్రోల్ ధరలపై నిరసిస్తూ నగరిలో కాంగ్రెస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి ధర్నా నిర్వహించారు. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడేళ్లలో రూ. 60 ఉన్న పెట్రోల్ ధరను రూ.110కి పెంచారని విమర్శించారు. పేదవాడికి నిత్యావసర సరుకులను అందనంత రేట్లకు పెంచి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డిది చెత్త పరిపాలనని విమర్శించారు. రాబోయే కాలంలో గుండు కొట్టించినా, గడ్డం పెంచినా పన్నులు వేస్తారని ఎద్దేవా చేశారు.

కృష్ణా జిల్లాలో..

పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని... వాటిని జీఎస్టీ పరిధిలోకి తేవాలని విజయవాడలో కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ప్రధాని మోదీ పెట్రోల్, గ్యాస్ ధరలను పెంచుతుంటే... రాష్ట్రంలో జగన్ పన్నులను పెంచుతున్నారని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలనతో ప్రజలు విసిగిపోయారని.... రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెబుతారని అన్నారు.

విశాఖ జిల్లాలో..

దేశంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు కారణంగా సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పాయకరావుపేటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిక్షా ర్యాలీ నిర్వహించారు. కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను పెంచి భారీగా ప్రజలను దోచుకుంటున్నారని విమర్శించారు.

కర్నూలు జిల్లాలో..

పెంచిన పెట్రోల్, డీజల్, గ్యాస్ ధరలను తగ్గించాలంటూ కర్నూలు జిల్లా నంద్యాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. రిక్షా, సైకిళ్లతో ర్యాలీ చేశారు.

అనంతపురం జిల్లాలో..

పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ అనంతపురం జిల్లా హిందూపురంలో కాంగ్రెస్ నాయకులు వినూత్నరీతీలో నిరసన తెలిపారు. తాళ్లతో ఆటోను లాగతూ... పెట్రోల్ బంకుల వద్ద సంతకాల సేకరణ చేశారు. మోదీ హఠావో దేశ్ బచావో అంటూ నినాదాలు చేశారు.

శ్రీకాకుళంలో..

పెట్రోలు, డీజీల్‌, గ్యాస్‌ ధరలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలంటూ శ్రీకాకుళంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేపట్టిన సైకిల్ ర్యాలీ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆగ్రహించిన నేతలు అక్కడే నిరసన వ్యక్తం చేశారు.

ప్రకాశం జిల్లాలో...

దేశంలో కొవిడ్​తో అతలాకుతలం అవుతున్న తరుణంలో కేంద్రం.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిత్యవసర ధరలను పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తున్నారని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. పెరిగిన ధరలను నిరసిస్తూ సైకిల్ తొక్కుతూ నిరసన తెలిపారు.

ఇదీ చదవండి:

ఆగస్టు 1లోపు ఉపాధిహామీ పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details