చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో అర్చకుల మధ్య వివాదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. తాజాగా ఆలయంలోని రాహు కేతు మండపంలో భక్తులు సమర్పించే దక్షిణ వాటాల పంపకం విషయమై అర్చకులు వాదనలకు బహిరంగంగానే దిగటం చర్చనీయాంశంగా మారింది. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆలయంలోని అన్ని ఆర్జిత సేవలు పరోక్షంగానే అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం రాహు, కేతు పూజ ఒక్కటే జరిపిస్తున్నారు. ఇక్కడ ఆదాయం ఎక్కువగా ఉండటంతో రాహు కేతు మండపానికి బదిలీ చేసుకునేందుకు అర్చకులు తమదైన శైలిలో ప్రయత్నాలు చేసి సఫలీకృతమవుతున్నారు.
ఇటీవల అర్చకుల అంతర్గత బదిలీలు జరిగాక ఈ వివాదం మరింతగా ముదురుతుంది. దక్షిణ రూపంలో వచ్చిన వాటాల పంపకం విషయంలో అర్చకుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ఆలయ ఉన్నతాధికారులు దృష్టి సారించకపోవటం విమర్శలకు తావిస్తోంది.