నివర్, బురేవీ తుపాన్ల ప్రభావంతో చిత్తూరు జిల్లాలోని రైతాంగం తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంది. ఎడతెరపి లేని వర్షాలు పంట పొలాలను ముంచెత్తాయి. 33 శాతానికి మించి నష్టపోయిన పంటల వివరాలను సేకరించారు. 12,343 హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. దాదాపు 41,704 మంది రైతులు నష్టపోయినట్లు అధికారులు నిర్ధరించారు. వీరికి పెట్టుబడి రాయితీగా రూ.20.05 కోట్లు మంజూరు చేసేందుకు నివేదికలు సిద్ధం చేశారు. వీటిని జిల్లా పాలనాధికారి నారాయణ భరత్ గుప్తా ఆమోదంతో ప్రభుత్వానికి నివేదించారు.
10,020 హెక్టార్లలో వ్యవసాయ పంటలు
వరుస తుపాన్లతో 10,020 హెక్టార్లలో వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయి. వరి, వేరుసెనగ, మొక్కజొన్న, ఉద్దుల పంటలు నీట మునగడంతో 35,511 మంది రైతులు నష్టపోయినట్లు వ్యవసాయాధికారులు గుర్తించారు. వీరికి పెట్టుబడి రాయితీగా రూ.14.99 కోట్లు మంజూరుకు ప్రభుత్వానికి నివేదికలు పంపామని వ్యవసాయ శాఖ జేడీ విజయకుమార్ తెలిపారు.