కరోనా పాజిటివ్ కేసులు గుర్తించిన వెంటనే రోగులను 108 వాహనాల ద్వారా దగ్గరలోని ట్రయాజ్ కేంద్రానికి తరలించాలని వైద్యాధికారులకు చిత్తూరు జిల్లా కలెక్టర్ డా.నారాయణ భరత్ గుప్తా సూచించారు. ట్రయాజ్ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, ఏరియా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, ప్రోగ్రామ్ అధికారులు, పీహెచ్సీ వైద్యాధికారులతో ఆయన టెలిలికాన్ఫరెన్సు నిర్వహించారు. ట్రయాజ్ కేంద్రానికి వచ్చిన కరోనా పాజిటివ్ కేసులన్నింటికీ తప్పనిసరిగా ఎక్స్ రే, ఈసీజీ, బ్లడ్ టెస్టులు చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
పాజిటివ్ కేసులకు సంబంధించిన ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లను గుర్తించి, ఆర్డీటీ టెస్ట్ కిట్లతో పరీక్షలు చేయించాలన్నారు. ట్రయాజ్ కేంద్రాల వైద్యాధికారులు కరోనా కేసుల తీవ్రతను బట్టి తక్కువ లక్షణాలు ఉన్న వారిని స్వీయ నిర్బంధంలోకి పంపాలన్నారు. అలాగే మధ్యస్థ లక్షణాలు ఉన్న వారిని దగ్గరలోని కోవిడ్ కేర్ కేంద్రాలకు తరలించాలని సూచించారు. తీవ్రమైన వ్యాధి లక్షణాలు ఉన్న వారిని 108 వాహనం ద్వారా కొవిడ్ చికిత్సలు అందిస్తున్న ఆసుపత్రులకు తరలించే ముందు సంబంధిత ఆసుపత్రుల ఇంచార్జ్‌లతో మాట్లాడి తరలించాలన్నారు. మదనపల్లి, పలమనేరు, పుంగనూరు ఆసుపత్రిల నుంచి కొవిడ్ పాజిటివ్ కేసులను కుప్పం పీఈఎస్ మెడికల్ కాలేజ్ కొవిడ్ సెంటర్‌కు పంపించాలని ఆదేశించారు.నేటి నుంచి తిరుపతిలోని ఎస్వీఆర్ ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్‌ని ట్రయాజ్ కేంద్రంగా గుర్తించి అక్కడ కోవిడ్ కేసులకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు.